ఇప్పుడది భూలోక నరకం...! | Syria Hell On Earth | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు పచ్చని సారవంతమైన నేల–ఇప్పుడది భూలోక నరకం...!

Published Tue, Mar 6 2018 4:17 AM | Last Updated on Tue, Mar 6 2018 4:17 AM

Syria Hell On Earth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సిరియాలో అంతర్యుద్ధ ప్రభావం తీవ్రంగా పడి ఘొటా ప్రాంతం  విలవిల్లాడుతోంది. కనుచూపు మేర ఆకుపచ్చటి దుప్పటి కప్పుకున్న పొలాలు. సారవంతమైన నేల. ఎక్కడ చూసినా కూరగాయల తోటలతో ఆహ్లాదకరమైన వాతావరణం.  సిరియా రాజధాని డమాస్కస్‌కు సమీపంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఒయాసిస్‌ (ఎడారిలో ఏర్పడే జలాశయం)గా పిలిచేవారు.

బరదా నది పక్కనే ఉండడంతో పుష్కలమైన నీటి వనరులతో అక్కడి వారికి పలురకాల ధాన్యం,  కూరగాయలు, పండ్లు స్థానికులకు అందుబాటులో ఉండేవి.  అయితే ఇదంతా కూడా ఒకప్పటి మాట. ఇప్పుడది భూలోక నరకం. ఆశ్రయం కోసం తలదాచుకుంటున్న ప్రదేశాలు సమాధులుగా మారిపోతున్నాయి. వైమానిక దాడుల్లో తొంభైశాతం భవనాలు నేలమట్టమై శిథిలభూమిని తలపిస్తోంది.

రాజధానికి పొరుగునే ఉన్న ఈ ప్రాంతాన్ని మళ్లీ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వ బలగాలు జరిపిన వైమానిక, సైనిక చర్యలకు  గత రెండు వారాల్లోనే 600 మందికి పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. గత ఆరేళ్లుగా తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న ఈ ఈశాన్యప్రాంతం ఇప్పుడు మరుభూమికి మారిపోయింది.

లక్షలాది మందిపై ప్రభావం...
ఐరాస లెక్కల ప్రకారం గత జనవరిలో 15వేల మందిని ఇళ్ల నుంచి తరిమేయడంతో, అత్యధికులు భూగృహాల్లో, ఇతర సహాయశిబిరాల్లో అమానవీయ పరిస్థితుల్లో బతుకుతున్నారు.  మంచినీళ్లు, పారిశుధ్యం, ఆహారం వంటి కనీస అవసరాలు తీరడం లేదు. ఈ ప్రాంతంలోనే అతి పెద్ద పట్టణం డౌమలో 1.20 లక్షల మంది భయంభయంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. వైరివర్గాల పోరులో నలిగిపోతున్నారు.

2015 ఆగస్టులో ఐరాస అంచనా ప్రకారం రెండున్నరలక్షల మంది ఈ యుద్ధంలో అసువులు బాసారు. సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌రైట్స్‌(బ్రిటన్‌కు చెందిన పర్యావేక్షక సంస్థ) 2017 డిసెంబర్‌లో వెల్లడించిన నివేదికను బట్టి 1.03 లక్షల మంది పౌరులతో సహా 3.46 లక్షల మంది మరణించినట్టు తెలుస్తోంది. అయితే వీరితో పాటు కనిపించకుండా పోయిన 56,900 మంది ప్రజలు కూడా మృతుల్లో భాగంగా అంచనా వేస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది.

అంతర్యుద్ధం కారణంగా  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  4.7 లక్షల మంది చనిపోయినట్టు 2016 ఫిబ్రవరిలో మరో సంస్థ అంచనా వేసింది. ఐరాస గణాంకాల ప్రకారం దాదాపు 56 లక్షల మంది (వారిలో అధికశాతం మహిళలు, పిల్లలు) సిరియా విడిచి లెబనాన్, జోర్డాన్, టర్కీలకు శరణార్దులుగా వెళ్లారు. సిరియాలోనే అంతర్గతంగా  61 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పదిశాతం సిరియన్లు ఐరోపా దేశాల శరణుజొచ్చారు.

యుద్ధమెలా మొదలైంది ?
హెచ్చుస్థాయిలో నిరుద్యోగం, సర్వత్రా వ్యాపించిన అవినీతి, రాజకీయ స్వాతంత్య్ర లేమి, ప్రభుత్వ అణచివేత వంటి కాలమాన పరిస్థితులు యుద్ధ వాతావరణానికి తెరతీశాయి. 2000లో తన తండ్రి హఫీజ్‌ స్ధానంలో బషర్‌ అల్‌–అసాద్‌ దేశాధ్యక్షుడయ్యాక సిరియాలో ప్రజల జీవన ప్రమాణాలు క్రమంగా దిగజారాయి. 2011 మార్చిలో దక్షిణ ప్రాంత నగరం డేరాలో చోటుచేసుకున్న  ‘అరబ్‌ వసంత మేఘగర›్జన’తిరుగుబాటు ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలకు  స్ఫూర్తినిచ్చింది.

ఈ అసమ్మతిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేయడంపై అధ్యక్షుడి రాజీనామా కోసం డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపించిన అశాంతిని అదేస్థాయిలో ›ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో  మొదట తమను తామును రక్షించుకునేందుకు ఆయుధాలు పట్టిన ప్రతిపక్షాలు ఆ తర్వాత తమ ప్రాంతాల నుంచి సైనిక బలగాలను తరిమేసేందుకు  ఉపయోగించాయి.

‘ఇతర దేశాల మద్దతుతో సాగుతున్న ఈ తీవ్రవాదాన్ని అణచేసి, మొత్తం దేశాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొస్తాను’ అంటూ ప్రతినబూనిన అసాద్‌ మిలటరీ దాడులు తీవ్రతరం చేశాడు. దేశవ్యాప్తంగా హింస ప్రజ్వరిల్లడంతో, ప్రభుత్వ దళాలతో యుద్ధానికి వందలాది  తిరుగుబాటు బృందాలు నడుం బిగించడం అంతర్యుద్ధానికి దారితీసింది.

విదేశాల జోక్యంతో...
అసాద్‌ అనుకూల, వ్యతిరేకవర్గాల మధ్య వైరంగా సాగుతున్న యుద్ధం కాసా ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, అమెరికా వంటి ప్రాంతీయ,ప్రపంచశక్తుల జోక్యంతో అక్కడి పరిస్థితి మరింత దిగజారింది. అటు ప్రభుత్వ, ఇటు వ్యతిరేకశక్తులు రెండింటికి ఈ దేశాలు సైనిక, ఆర్థిక, రాజకీయ మద్దతు అందించడంతో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇది కాస్తా సిరియాను ప్రచ్ఛన్న యుద్ధ క్షేత్రంగా మార్చివేసింది.

మౌలికంగా సెక్యులర్‌ దేశంగా ఉన్న సిరియా కాస్తా బయటిశక్తుల ప్రమేయంతో అక్కడ వర్గపోరు తలెత్తిందని ఆరోపణలున్నాయి. జిహాదీ గ్రూపుల ప్రాబల్యం పెరగడంతో ఈ యుద్ధానికి కొత్తకోణాలు ఏర్పడ్డాయి. సిరియా ఈశాన్యప్రాంతంలోని అధికశాతం ప్రాంతాలను ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసీస్‌) ఆధీనంలోకి వచ్చాయి.  ప్రభుత్వ దళాలకు  రష్యా మద్దతు,టర్కీ అనుకూల తిరుగుబాటుదళాల సహాయం, అమెరికా తోడ్పాటున్న కుర్ద్‌ మిలటరీ దళాల సహకారంతో ప్రస్తుతం  పట్టణప్రాంతాల నుంచి ఐసీస్‌ను తరిమేస్తున్నారు.

ప్రభుత్వ,ప్రతిపక్షాల్లో ఏదీ కూడా నిర్ణయాత్మక విజయాన్ని సాధించకపోవడంతో 2012 జెనీవా ఒప్పందం ప్రకారం ఈ సంక్షోభానికి తెరదించాలని ఐరాస భద్రతా మండలి సూచించింది. విపక్షాలతో చర్చించేందుకు అసాద్‌ విముఖంగా ఉండడంతో ఈ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదనే అభిప్రాయం ఏర్పడింది.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement