కరాచీ విమానాశ్రయంపై తాలిబన్ల దాడి | Taliban attack on Karachi airport | Sakshi
Sakshi News home page

కరాచీ విమానాశ్రయంపై తాలిబన్ల దాడి

Published Tue, Jun 10 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

కరాచీ విమానాశ్రయంపై తాలిబన్ల దాడి

కరాచీ విమానాశ్రయంపై తాలిబన్ల దాడి

తిప్పికొట్టిన పాక్ భద్రతా బలగాలు
10 మంది ఉగ్రవాదులు సహామొత్తం 29 మంది మృతి
13 గంటలు సాగిన కాల్పులు

 
కరాచీ: పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆదివారం ఆర్ధరాత్రి సమయంలో ప్రారంభమైన ఈ దాడి సోమవారం మధ్యాహ్నం వరకు సుమారు 13 గంటలపాటు సాగింది. భద్రతాదళాల దుస్తుల్లో వచ్చిన మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు సాగించారు. పాక్‌భద్రతాదళాలు ఈ దాడిని తిప్పికొట్టాయి. ఇరుపక్షాలమధ్య జరిగిన భీకరపోరులో మొత్తం 29 మంది మృతిచెందారు. ఇందులో 10 మందివరకు ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం. నిషేధిత తెహ్రికే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే పాల్పడినట్టు ప్రకటించింది. ప్రస్తుతం విమానాశ్రయం పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని, ఉగ్రవాదులను మట్టుపెట్టామని పాక్ పారామిలిటరీ రేంజర్స్ ప్రతినిధి సిబ్తియాన్ రిజ్వీ మీడియాకు తెలిపారు. 17 గంటల అనంతరం విమానాశ్రయాన్ని తిరిగి ప్రయాణికులకోసం తెరిచారు. పదిమంది ఉగ్రవాదులు రెండు బృందాలుగా విడిపోయి ఈ దాడి చేశారని ఆయన వివరించారు. ఆర్మీ, పారామిలిటరీ రేంజర్లు, పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది కలిసి ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టినట్టు ఆయన చెప్పారు. తుపాకీ గుళ్ల గాయాలను సెకండ్లలోనే మానిపించే ఆధునిక పరికరాలు, మందులను ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్నారని తెలిపారు. విమానాశ్రయాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారు అన్ని ఏర్పాట్లతో వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు.

గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడిచేశారని ఆయన వివరించారు. ఈ దాడిలో 11 మంది విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ఇద్దరు రేంజర్లు, ఓ పోలీసు అధికారి, నలుగురు సిబ్బంది మృతిచెందారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, దేశంలో పౌరవిమాన నెట్‌వర్క్‌ను కుప్పకూల్చడానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు అధికారులు ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు అందించిన నివేదికలో పేర్కొన్నారు. విమానాశ్రయంలో ఉన్న విమానాలన్నిటినీ పేల్చివేయడానికి ఉగ్రవాదులు వ్యూహం పన్నారని, అయితే భద్రతాదళాలు వారి ప్రయత్నాలను భగ్నం చేశాయని ఆ నివేదికలో వివరించారు.
 విధ్వంసమే లక్ష్యం...ఉగ్రవాదులు ఆహారం, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని తమ వెంట తెచ్చుకున్నారు. పాక్ దళాలు జరిపిన ఎదురుదాడిలో ఏడుగురు ఉగ్రవాదులు మృతిచెందగా, మరో ముగ్గురు ఆత్మాహుతికోసం ఉపయోగించే బెల్టులను పేల్చడంద్వారా మృతిచెందినట్టు తెలుస్తోంది. విమానాలను హైజాక్ చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తాలిబన్ల ప్రతినిధి షహీద్ పేర్కొన్నాడు. ఈ దాడి తమ సత్తాకు చిన్న ఉదాహరణమాత్రమేనని, ముందు ముందు మరిన్ని దాడులకు పాల్పడతామని షహీద్ హెచ్చరించాడు. కాగా, ఉగ్రవాదులు ప్రధాన టెర్మినల్‌వద్దకు వెళ్లిఉంటే భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని, ప్రయాణికులను బందీలుగా పట్టుకునే అవకాశాలుండేవని అధికారులు అభిప్రాయపడ్డారు. విమానాశ్రయంలోని కొంత భాగం మంటలకు కాలిపోయింది.

 భారత్‌లో విమానాశ్రయాలకు గట్టి భద్రత

న్యూఢిల్లీ: కరాచీు విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా దేశంలోని 59 ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ విమానాశ్రయాల్లో సుమారు 23వేలమంది సీఐఎస్‌ఎఫ్ బలగాలను భద్రతకోసం వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరాచీ దాడిని భారత్ ఖండించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement