ఆ దృశ్యాన్ని చూసి భయంతో ...
మాస్కో: అది రష్యాలోని మియాస్ నగరం. మిట్ట మధ్యాహ్నం. ఎర్రటి ఎండ కాస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదవ అంతస్తు కిటీకీ కొద్దిగా తెరుచుకొని ఉంది. ఇంతలో అందులో నుంచి రెండేళ్ల బాలుడు మెల్లగా బయటకొచ్చి నిటారుగా కిటికీలో నిలబడ్డాడు. కొద్దిగా వొంగి రోడ్డుపై వెళుతున్న వాహనాలను చూస్తున్నాడు. దానికి గ్రిల్ లేదు. బాలుడి కాళ్ల కింద ఆసరాగా ఉన్న చెక్క కూడా బలంగా లేదు. ఈ దృశ్యాన్ని గమనించిన బాటసారులకు జరగబోయే దారుణాన్ని ఊహించి ముచ్చెమటలు పోశాయి.
వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చేలోగానే ఇంట్లోనే మరో గదిలో ఉన్న తల్లి కూడా ఈ దృశ్యాన్ని చూసింది. ఒక్క క్షణంపాటు భయంతో నిశ్చేష్ఠురాలైంది. వెంటనే తేరుకొని, ఎలాంటి కంగారు లేకుండా ‘బాబు, బుజ్జీ, నాన్న! అన్నం తిందురా’ అంటూ లోపలికి పిలిచింది. ఆ రెండేళ్ల బాలుడు ఎలాగైతే బయటకొచ్చాడో, అలాగే లోపలికి పోయాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన బాటసారులు, ఇంతలో అక్కడికొచ్చిన పోలీసులు హమ్మయ్యా! అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.
కిటికీలో నుంచి బయటకొచ్చి ప్రమాదం అంచున నిలబడినప్పుడు కూడా ఏ మాత్రం భయపడని ఆ బాలుడు లోపలికెళ్లాక తల్లి పెట్టిన చీవాట్లకు మాత్రం గుక్కపట్టి అరగంట ఏడ్చాడు. ఆ బాలుడి పేరేమిటో, తల్లి వివరాలేమిటో తెలియదుగానీ పిల్లవాడు కిటికీలో నుంచి బయటకు రావడాన్ని, మళ్లీ లోపలికి వెళ్లడాన్ని వీడియో తీసిన ఓ బాటసారి ఆన్‌లైన్‌లో దాన్ని పోస్ట్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు.