బ్యాంకాక్ పేలుళ్లనాటి భీకర దృశ్యాలు (ఫైల్)
సంచలనం సృష్టించిన బ్యాంకాక్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఒక విదేశీయుణ్ని బ్యాంకాక్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బన్ పా రాయ్ సరిహద్దు గుండా బర్మా(మయన్మార్)లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని మంగళవారం ఉదయం సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తసుకుని పోలీసులకు అప్పగించాయని, విదేశీయుడైన అతడే పేలుళ్ల ప్రధాన నిందితుడని థాయిలాండ్ ప్రధానమంద్రి ప్రయుత్ ఛానో ఛా మీడియాకు వెల్లడించారు.
అయితే నిందితుడి పేరు సహా ఇతర వివరాలేవీ వెల్లడించకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. నిందితుడు విదేశీయుడైనందున సమగ్ర దర్యాప్తు తర్వాతే అతడిది ఏదేశం? అతని వెనుక ఎవరున్నారు? తదితర విషయాలు వెల్లడిస్తామని ప్రధాని పేర్కొన్నారు.
ఆగస్టు 17 బ్యాంకాక్ లోని పర్యాటక క్షేత్రమైన బ్రహ్మదేవాలయం వద్ద సంభవించిన శక్తిమంతమైన బాంబు పేలుళ్లలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన రెండు వారాల తర్వాత ఈ రోజు ప్రధాన నిందితుడు అరెస్టయ్యాడు.