
హెచ్‌ఐవీని చంపే కండోమ్ వచ్చేస్తోంది...
ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్‌ఐవీని అడ్డుకోవడమే కాదు.. దానిని పూర్తిగా హతమార్చగలిగే రక్షణ కవచం త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్‌ఐవీని అడ్డుకోవడమే కాదు.. దానిని పూర్తిగా హతమార్చగలిగే రక్షణ కవచం త్వరలోనే అందుబాటులోకి రానుంది. హెచ్‌ఐవీని చంపగల సమర్థమైన కండోమ్‌ను అభివృద్ధిపర్చినట్లు ఆస్ట్రేలియాలోని ‘స్టార్‌ఫార్మా’ కంపెనీ ప్రకటించింది. ‘వైవాజెల్ కండోమ్’గా పేరుపెట్టిన ఈ నిరోధ్‌కు ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(టీజీఏ) అనుమతి కూడా లభించిందని, కొద్ది నెలల్లోనే ఈ కండోమ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆ కంపెనీ వెల్లడించింది.
ఆస్టోడ్రైమర్ సోడియమ్ అనే రసాయనంతో తయారు చేసిన జెల్‌ను వైవాజెల్ నిరోధ్ తయారీలో ఉపయోగించారట. ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ జెల్ హెచ్‌ఐవీ వైరస్‌లను 99.9 శాతం కచ్చితత్వంతో చంపేసిందట. హెర్పిస్ (పొక్కులు), హ్యూమన్ పాపిలోమా వైరస్‌లను కూడా ఈ నిరోధ్ హతమారుస్తుందట. హెచ్‌ఐవీని చంపే కండోమ్ తయారీ ప్రపంచంలో ఇదే తొలిసారని, దీనిని ఉపయోగిస్తే హెచ్‌ఐవీ, సుఖవ్యాధుల నుంచి వంద శాతం రక్షణ లభించినట్లేనని కంపెనీవారు ధీమాగా చెబుతున్నారు.