ప్రాచీన మానవ జాతి శిలాజం గుర్తింపు
భూమిపై అంతరించిన అనేక మానవ జాతుల్లో ఇంకా చాలా వరకు గుర్తించాల్సి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇథియోపియాలో పరిశోధకులు ఇటీవల ప్రాచీన మానవ జాతి శిలాజాన్ని గుర్తించారు. 3.3-3.5 మిలియన్ల సంవత్సరాల కాలం నాటి మానవ శిలాజం ఇథియోపియాలోని అఫర్ ప్రాంతంలో లభించింది. నలుగురు వ్యక్తులకు చెందిన దవడ ఎముకల్ని, దంతాల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి కోతి, మానవ ఆనవాళ్లు రెండింటినీ కలిగి ఉంది. దవడ చాలా బలంగా ఉండగా, దంతాలు చాలా చిన్నగా ఉన్నాయి.
ఈ శిలాజం కూడా హుమానియన్ మానవ జాతులు నివసించినప్పటి కాలం నాటివేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. మానవ జాతుల గురించి కనుక్కోవడం ఇప్పటివరకు అనుకున్న దాని కంటే ఇంకా క్లిష్టమైనదని పరిశోధకులు అంటున్నారు. ఇది కూడా హుమానియన్ కాలానికి చెందిన మానవ జాతే అని, ఒక జాతి తర్వాత మరో జాతి జీవించి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇతర జాతులతో పోలిస్తే హుమానియన్ జాతి మానవులు అత్యంత శక్తిమంతమైన వారు. ఈ కొత్త జాతికి వీరు ఆస్ట్రాలోపిథెకస్ డెయిరెమెడా అనే పేరు పెట్టారు. అఫర్ ప్రాంతంలోని స్థానిక భాష మాట్లాడేవారికి దగ్గరివారని దీనర్థం.