అక్రమ వలసదారులకు వరం
- అమెరికా నుంచి పంపేయకుండా తాత్కాలిక ఉపశమనం
- పార్లమెంటును పక్కకుబెట్టి మరీ.. కీలక సంస్కరణలకు ఒబామా శ్రీకారం
- యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న భారతీయులకు ఉపశమనం
వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న 50 లక్షల మందికి పైగా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగే నిర్ణయాన్ని శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. అస్తవ్యస్థంగా ఉన్న అమెరికా వల స విధానాన్ని సరిదిద్దే చర్యల్లో భాగంగా ఈ కీలక సంస్కరణను ఆయన ఏకపక్షంగా చేపట్టారు. తన కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించడం ద్వారా పార్లమెంటు ఆమోదం లేకుండానే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు వైట్‌హౌస్‌లో ఆయన ప్రసంగించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు. ‘మీరు అమెరికాలో ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఉండి ఉంటే, మీకు అమెరికా పౌరసత్వం లేదా చట్టబద్ధమైన నివాస హోదా గల బిడ్డలు ఉంటే.. మీకు నేరనేపథ్యం లేదని పోలీసు తనిఖీలో తేలితే.. మీరు మీ వంతు పన్నులు చెల్లించడానికి సుముఖత చూపితే.. అప్పుడు దేశం నుంచి గెంటివేతకు గురవుతారన్న భయం లేకుండా దేశంలో తాత్కాలికంగా ఉండేందుకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు’ అని ఒబామా అక్రమ వలసదారులకు సూచించారు. దీని ప్రకా రం, పైన చెప్పిన అర్హతలు ఉన్న అక్రమ వలసదారులుమరోమూడేళ్లపాటుఅమెరికాలో తాత్కాలికంగా ఉండేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
శాశ్వత హోదా కాదు: ఎలాంటి ఇమిగ్రేషన్ పత్రాలూ లేకుండా అమెరికాలో జీవిస్తున్న లక్షల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి గెంటేయకుండా వారికి ఈ నిర్ణయం ద్వారా తా త్కాలిక రక్షణ లభించనుంది. గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది భారతీయులకు కూడా ఉపశమనం లభిస్తుంది. అక్రమ వలసదారులకు ఫ్రీపాస్ ఇస్తున్నారన్న ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ల విమర్శలపై స్పందిస్తూ.. తాను శాశ్వత నివాస హోదా ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. సరిహద్దు రక్షణను మరింత కట్టుదిట్టం చేసి, దేశంలోకి చొరబాట్లను అడ్డుకుంటామని ఒబామా వివరించారు.
‘ఎలాంటి పత్రాలూ లేకుండా ఇక్కడ జీవిస్తున్న దాదాపు 1.1 కోట్ల మంది వలసదారులను ఉన్నట్టుండి స్వదేశాలకు గెంటేయడం మన దేశ సహజ గుణానికి విరుద్ధం. అది అసాధ్యం కూడా’ అన్నారు. తన నిర్ణయం కామన్‌సెన్స్‌తో కూడుకున్నదని, దీని ద్వారా చట్టాన్ని గౌరవించాలనుకునే అనేకమంది అక్రమ వలసదారులు చట్టబద్ధత పొందుతారని పేర్కొన్నారు. అమెరికా అభివృద్ధిలో పాలుపంచుకునేందుకుమంచి నైపుణ్యత కలిగిన ఉద్యోగులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఇది సదవకాశమన్నారు.