- సీపీ కార్యాలయానికి భారత రాయబారి సమాచారం
గాజువాక: విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన ఒక జంట శ్రీలంకలోని కొలంబోలో అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనిపై అక్కడి భారత రాయబారి నుంచి నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గాజువాక సమీపం శ్రీనగర్‌లోని ఫ్రెండ్స్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న బొబ్బా పృథ్వీరాజ్ (30)కు చెన్నైలోని కోమత్‌నగర్‌కు చెందిన నాగబోయిన మహాలక్ష్మి(28)తో ఏడాది క్రితం వివాహమైనట్టు తెలిసింది. వీరిద్దరూ గత నెల చివరి వారంలో కొలంబో వెళ్లారు. అక్కడ వెల్లవెట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో గత నెల 27న బస చేశారు.
ఈ నెల ఒకటో తేదీ రాత్రి నుంచి వారు బయటకు రాకపోవడంతో హోటల్ యజమాని అక్కడి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు గదిలో వారిద్దరూ మృతి చెందినట్టు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం నుంచి తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్.. సమాచారాన్ని గాజువాక పోలీసులకు తెలిపారు.
దీంతో వారు ఈ సమాచారాన్ని మృతుని బంధువులకు తెలిపారు. ఫ్రెండ్‌స ఎన్‌క్లేవ్‌లోని ప్లాట్‌లో పృథ్వీరాజ్ సోదరి ఉంటున్నట్టు పోలీసు వర్గాల సమాచారం. మృతుని తల్లిదండ్రులు రెండేళ్ల క్రితమే వేరే ప్రాంతంలో స్థిరపడ్డారని,పృథ్వీరాజ్ ఇక్కడి చిరునామాతో విదేశాలకు వెళ్లాడని చెబుతున్నారు.