అతి పురాతన కంప్యూటర్...
కంప్యూటర్ అంటే... డిజిటల్ సమాచారాన్ని ప్రాసెసింగ్ చేసే యంత్రమే కాదు.. ఆటోమేటిక్‌గా లెక్కలు చేసి పెట్టేది కూడా. ఆ లెక్కన చూస్తే.. ఇది ప్రపంచంలోనే అతి పురాతన కంప్యూటర్. క్రీస్తుపూర్వం 205లో దీనిని నిర్మించారట. క్రీటే, గ్రీస్‌ల మధ్య సముద్రంలో మునిగిపోయిన నౌక శిథిలాల్లో ఇది 1901లో దొరికింది.
13 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పు ఉన్న పెట్టెలో ఇది ముక్కలుగా కనిపించింది. తర్వాత పరిశోధన మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు.. ఇది గ్రహాల స్థానాలు, సూర్య, చంద్రగ్రహణాల తేదీలు, సమయాలను చెప్పే కంప్యూటర్‌గా తేల్చారు. దీనికి ‘యాంటికెథైరా మెకానిజమ్’గా పేరు పెట్టి వయసును క్రీ.పూ. 125గా నిర్ణయించారు.
అయితే తాజాగా మళ్లీ పరిశోధన చేపట్టిన అర్జెంటినాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్విల్మెస్, యూనివర్సిటీ ఆఫ్ పుగెట్ శాస్త్రవేత్తలు ఇది క్రీస్తుపూర్వం 205 లోనే నిర్మించి ఉంటారని వెల్లడించారు. ఇది బాబిలోనియన్ల కాలం నాటిదని అంచనా వేశారు.