ఉచితంగా ఆన్‌లైన్ హెల్త్‌టెస్ట్
లండన్: ఇంకో ఐదేళ్లపాటు మనం జీవించే అవకాశం ఉందా, లేదా ? అన్న అంశాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ఓ ఐదు నిమిషాల ఆన్‌లైన్ టెస్ట్‌ను తయారు చేశారు. 40 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సుగలవారిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో మహిళలకు సులభమైన 11 ప్రశ్నలను, పురుషులకు అంతే సులభమైన 13 ప్రశ్నలను వేసి సమాధానాలను రాబట్టి వాటి ఆధారంగా మరో ఐదేళ్లు మనం బతికే అవకాశం ఉందా, లేదా అన్న విషయాన్ని తేల్చి చెబుతారు. తమ అంచనాలు కచ్చితంగా ఉంటాయని టెస్ట్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘యుబుల్ (యుబీబీఎల్‌ఈ)’ వెబ్‌సైట్‌పై గురువారం ఉదయం ఈ హెల్త్ టెస్ట్‌ను ఆవిష్కరించారు. ఇది ఉచితంగానే ప్రజలందరికి అందుబాటులో ఉంటుంది.
బ్రిటన్‌లోని బయోబ్యాంక్‌లు వాలంటీర్లుగా కొనసాగుతున్న ఐదు లక్షల మంది ప్రజల గత ఐదేళ్ల ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేయడం ద్వారా ఈ టెస్ట్‌ను రూపొందించామని, ఇప్పటికే 35వేల మందిపై దీన్ని ప్రయోగించి చూడగా, 80 శాతం ఫలితాలు కచ్చితంగా ఉన్నాయని స్వీడన్‌కు చెందిన ప్రొఫెసర్ ఎరిక్ ఇంగెల్సన్ తెలిపారు. ఈ హెల్త్ టెస్ట్‌కు రూపకల్పన చేసి శాస్త్రవేత్తల బృందానికి ఆయనే నాయకత్వం వహించారు. ఆయన బృందం పరిశోధన వివరాలను ‘లాన్సెట్ మెడికల్ జర్నల్’లో కూడా గురువారం నాడే ప్రచురించారు. ప్రధానంగా తాము బ్రిటన్ ప్రజల లైవ్‌స్టైల్‌ను, వారి మెడికల్ హిస్టరీని పరిగణలోకి తీసుకొని ఆన్‌లైన్ టెస్ట్‌ను రూపొందించడం వల్ల టెస్ట్‌లో బ్రిటన్ ప్రజల ఫలితాలే కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఇంగెల్సన్ వివరించారు.
టెస్ట్‌లో పురుషులకు వేసే ప్రశ్నలు
1. మీ వయస్సెంత.
2. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు.
3. మీకు ఎన్ని కార్లు, వ్యాన్లు ఉన్నాయి.
4. మీకు పొగతాగే అలవాటు ఉందా. ఉంటే ఎంతగ్యాప్‌లో తాగుతారు
5. మొత్తంగా మీ ఆరోగ్యం ఎలా ఉందని మీరు భావిస్తున్నారు.
6. ఎంత వేగంతో మీరు నడుస్తారు.
7. డాక్టర్ ఎప్పుడైనా మీకు మధుమేహ వ్యాధి ఉన్న చెప్పారా.
8. క్యాన్సర్ ఉందని చెప్పారా.
9. గుండెపోటు, బీపీ ఉందని చెప్పారా.
10. రెండేళ్ల క్రితం తీవ్రమైన జబ్బుబారిన పడ్డారా, ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారా.
11. మీకేమైన అటెండెంట్, అంగవికల అలవెన్సులు వస్తున్నాయా? ఇక మహిళలకు వేసే ప్రశ్నలు స్వల్ప తేడాలతో ఇలాగే ఉంటాయి. ఎంత మంది పిల్లలు లాంటి ప్రశ్నలు ఉంటాయి.