ఢాకాలో కొనసాగుతున్న ఆపరేషన్
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు భద్రత దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. భద్రత దళాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చి, 12 మంది బందీలను విడిపించాయి.
శుక్రవారం రాత్రి గుర్తుతెలియని సాయుధులు ఢాకాలోని హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్నవారిని బంధించిన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాదులు వేర్వేరుగా ప్రకటించారు. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు రెస్టారెంట్పై దాడికి పాల్పడ్డారు. బందీలుగా ఉన్నవారిలో విదేశీయులే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. భద్రత దళాలు రెస్టారెంట్ను చుట్టుముట్టి బందీలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢాకాలోని భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.