'పాలబుగ్గలతోనే ఉక్కులా తయారయ్యాడు'
కాన్బెర్రా: మూడేళ్ల బాలుడు అంటే మనకెంతో మురిపం. క్షణమైనా కాలు కిందపెట్టకుండా ఇంట్లో వాళ్లంతా ముద్దు చేస్తుంటారు. అతడికి చిన్న కష్టం కూడా కలగనీయకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నదెబ్బతగిలినా అయ్యో అని కంగారుపడిపోతుంటారు. అక్కడికీ ఇక్కడికీ పరుగులు పెట్టొద్దని అడ్డుకుంటుంటారు. కానీ, ఆస్ట్రేలియాలో డాష్ ఓ మూడేళ్ల బాలుడు చేసిన సాహసం చూస్తే మాత్రం ఔరా అని ఆశ్చర్యపోయి ముక్కున వేలుసుకోవాల్సిందే. ఇక బద్దకస్తులుగా ఉండి.. భారీగా పొట్టలు పెంచుకునేవారైతే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఎందుకంటే ఆ బాలుడు చేసింది మాములు సాహసం కాదు.
బాగా తినేసి గంటలకొద్ది జిమ్ముల్లో గడిపినా నేటి యువకులు పొందలేని సిక్స్ ప్యాక్ (ఆరుపలకల దేహం)ను ఈ మూడేళ్ల బుడతడు సాధించాడు. అంతేకాదు, ఏకధాటిగా నాలుగు కిలోమీటర్లు అలవోకగా పరుగెత్తగలడు. కొండలు ఎక్కుతాడు, జంపింగ్లు చేస్తాడు. జిమ్ లో డంబెల్స్ ఎత్తుతాడు, బెంచ్ కొడతాడు. అప్ డౌన్స్ చేస్తాడు. ఇన్ని ప్రయోగాలు చేస్తూ పాలబుగ్గల వయసులోనే తన లేత శరీరాన్ని ఉక్కుకవచంలా తయారు చేశాడు. ఇంతచేసినా తన కుమారుడు మాత్రం అందరు పిల్లల్లాగానే మళ్లీ తన కొంగుపట్టుకొని ఐస్ క్రీం అడుగుతాడని ఆ చిట్టిబుడతడి తల్లి మురిసిపోతుంది. వాడి కసరత్తు ఆటలను చూసి ముచ్చటపడిన తల్లి ఉర్సులా ఇటీవలనే హ్యాంగింగ్ రాడ్, రింగ్స్ గిఫ్ట్‌గా తీసుకొచ్చింది. పిల్లాడి పేరు మీద ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా తెరిచింది. అతడి కసరత్తు ఫొటోలను ఎప్పటికప్పుడు ఆ ఖాతాలో పోస్ట్ చేస్తోంది. ఆ ఫొటోలకు లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి.
వాడు తనకు కృత్రిమ గర్భం ద్వారా పుట్టాడని, ప్రిమెచ్యూర్‌గా పుట్టడం వల్ల చాలా బలహీనంగా ఉండేవాడని, 11 నెలలు వచ్చినాగానీ సరిగ్గా నడిచేవాడు కాదని తల్లి ఉర్సులా తెలిపారు. పిల్లాడిని ఆరోగ్యవంతుడిని చేయాలనే ఉద్దేశంతో రెండో ఏట నుంచి ఆ బాలుడిని తీసుకొని తాను గార్డెన్‌లో పరుగెత్తేదాన్నని ఆమె వివరించారు. అలా అలవాటైన డాష్ క్షణం కూడా ఆగకుండా ఏకధాటిగా నాలుగు మైళ్లు పరుగెత్తుతాడని, నాలుగైదు గంటలపాటు అలుపెరగకుండా కసరత్తు చేస్తాడని చెప్పారు.
అందరి పిల్లాడిలా వాడికి కూడా ఓ చెడలవాటు ఉందని, ఎప్పుడూ చాక్లెట్లు తింటుంటాడని, అందుకోసం ఏ మాత్రం వీలు చిక్కినా చక్కాపోయి ఫ్రిజ్‌లో మొహం పెడతాడని ఉర్సులా తెలిపారు. డాష్ ను జిమ్ములో చేర్చాలని, ఒలంపిక్ క్రీడల లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని చుట్టుపక్కల వాళ్లు తనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని, తానుమాత్రం ఇప్పటిలా ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్‌లో వాడెమవతాడో తనకు తెలియదని, అది వాడి ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుందని ఉర్సులా మీడియాతో వ్యాఖ్యానించారు.