ఆ ‘రెడ్ ఫోన్’ మళ్లీ మోగుతుందా?
ఆ ‘రెడ్ ఫోన్’ మళ్లీ మోగుతుందా?
Published Fri, Dec 23 2016 9:56 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
♦ అమెరికా – సోవియట్ రష్యాల మధ్య హాట్ లైన్
♦ అధ్యక్షుల మధ్య నేరుగా సంప్రదింపుల మార్గం
♦ అణు ఉద్రిక్తతలు తగ్గించడమే ప్రధాన లక్ష్యం
♦ సోవియట్ పతనంతో తగ్గిపోయిన ఉద్రిక్తతలు
♦ మళ్లీ అణ్వస్త్ర బాటలో అగ్ర రాజ్యాల పయనం
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
అమెరికా, సోవియట్ రష్యాల మధ్య నాలుగు దశాబ్దాల పాటు సాగిన ప్రచ్ఛన్న యుద్ధం రెండున్నర దశాబ్దాల కిందట సమసిపోయింది. మూడో ప్రపంచ యుద్ధం ఏ క్షణంలోనైనా ముంచుకురావచ్చు అన్నంత స్థాయిలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని ఉండేవి. పోటాపోటీగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తూ.. ప్రత్యర్థి దేశం లక్ష్యంగా అణ్వస్త్ర క్షిపణులను మోహరించేవి. సోవియట్ రష్యా పతనం తర్వాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా నిలిచింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయి.. ఆయుధ పోటీ తగ్గిపోయింది. అయితే.. తాజా పరిణామాలను, అధినేతల మాటలను చూస్తే.. ఈ రెండు దేశాల మధ్య మళ్లీ అణ్వాయుధాల పోటీ మొదలవుతుందా? అన్న ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అణ్వాయుధాలను బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నట్లు మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆ వెంటనే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం చూస్తే ఇదే అనిపిస్తోంది! గతంలో రెండు దేశాల మధ్య అణు ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏర్పాటు చేసుకున్న ‘రెడ్ ఫోన్’ కథాకమామీషు ఇదీ...
అమెరికా – రష్యాల మధ్య అణ్వాయుధ పోటీ మున్ముందు ఎలా ఉంటుందో కానీ.. అర్థ శతాబ్దం కిందట మాత్రం ఈ పోటీ అణుయుద్ధం అంచుల దాకా వెళ్లింది! 1962 అక్టోబర్లో రష్యా లక్ష్యంగా ఇటలీ, టర్కీల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరిస్తే.. అమెరికాకు గురిపెడుతూ క్యూబాలో రష్యా అణ్వాయుధాలను సంసిద్ధం చేసింది. అప్పుడు రెండు వారాల పాటు ప్రపంచం గజగజ వణికిపోయింది. అయితే.. ఇరు దేశాలూ రాజీకి వచ్చి అణ్వాయుధాలను ఉపసంహరించడంతో ప్రపంచానికి పెను ప్రమాదం తప్పిపోయినట్లయింది. ఆ క్రమంలో ఇరు దేశాల అధినేతల మధ్య సంప్రదింపులు, సమాచార మార్పడికి విపరీతమైన జాప్యం జరిగింది. మాస్కో – వాషింగ్టన్ల మధ్య సమాచారం ప్రయాణించడానికి 12 గంటలు పట్టేది. సమాచారం ఖచ్చితమైనదేనా అన్న సందేహాలూ ఉండేవి. దీంతో.. అధ్యక్షుల మధ్య మంతనాలను వేగవంతం చేయడానికి హాట్లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా.. ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్న సమయంలో తొందరపాటుతో అణ్వాస్త్రాలను ప్రయోగించే పెను ముప్పును నివారించడానికి ఇటువంటి హాట్లైన్ అవసరమని ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఫోన్ కాని ఫోన్..!
ఈ హాట్లైన్ను అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ ‘రెడ్ ఫోన్’గా పరిగణిస్తుంటారు. కానీ వాస్తవానికి అది ఫోన్ కాదు. అప్పటికి ఆధునిక హాట్లైన్ టెలిఫోన్ సాంకేతికత లేనేలేదు. అటు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సమీపంలో.. ఇటు అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ సమీపంలో గల పెంటగన్లో.. నేరుగా సమాచార సంబంధాల కోసం టెలీటైప్, టెలీగ్రాఫ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అమెరికాలో తయారు చేసిన నాలుగు టెలీటైప్ మెషీన్లను క్రెమ్లిన్కు పంపించారు. తూర్పు జర్మనీలో తయారైన నాలుగు మెషీన్లను పెంటగన్లో ఏర్పాటు చేశారు. ఇరు దేశాలూ ఎన్కోడింగ్ పరికరాలను (రష్యన్ భాషలో సందేశాన్ని ఇంగ్లిష్లోకి, ఇంగ్లిష్ భాషలో సందేశాన్ని రష్యన్లోకి తర్జుమా చేయడం కోసం) కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఈ వ్యవస్థలనే హాట్లైన్గా పరిగణించేవారు. నిజానికి ఈ సమాచార వ్యవస్థ కూడా ‘నేరుగా’ లేదు. ఈ టెలిగ్రాఫిక్ సర్క్యూట్ అమెరికా రాజధాని వాషింగ్టన్ నుంచి లండన్, కోపెన్హాగెన్, స్టాక్హోం, హెల్సింకిల మీదుగా 10 వేల మైళ్లు ప్రయాణించి మాస్కోకు చేరుతుంది. మాస్కో నుంచి అదే మార్గంలో వాషింగ్టన్కు చేరుతుంది. అయితే.. అమెరికా – రష్యాల మధ్య ఏర్పాటు చేసిన ఈ హాట్లైన్ను సాధారణ జనం ‘రెడ్ ఫోన్’గా పరిగణించేవారు. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రష్యా అధ్యక్షుడికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చన్న అపోహ కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. డాక్టర్ స్ట్రేంజ్లవ్, ఫెయిల్-సేఫ్ వంటి హాలీవుడ్ సినిమాల్లో దీనిని ఒక ఫోన్ లాగానే చూపించడమూ ఇందుకు కారణం. అణు దాడి నుంచి అమెరికాకు భద్రత కల్పించడం కోసం.. రక్షణ విభాగాల్లో ఒక ప్రత్యేక హాట్లైన్ వ్యవస్థను ఉపయోగించేవారు. నలుపు రంగులో ఉండే మిగతా ఫోన్ల నుంచి వేరుగా ఉండటానికి ఈ హాట్లైన్ కోసం ఎరుపు రంగు ఫోన్లు ఉపయోగించేవారు. అలా ‘రెడ్ ఫోన్’ అనే పేరు అమెరికా – రష్యా అధ్యక్షుల మధ్య హాట్లైన్కు కూడా వచ్చి చేరింది.
మొదటి సందేశం ఫాక్స్.. డాగ్స్..!
ఈ హాట్లైన్ 1963 ఆగస్టు 30న పని చేయడం మొదలు పెట్టింది. మొట్టమొదటి సందేశం అమెరికా నుంచి ‘‘ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్డ్ ఓవర్ ది లేజీ డాగ్స్ బ్యాక్ 1234567890’’ అని ఇంగ్లిష్లో పంపించారు. ఇంగ్లిష్లోని అన్ని అక్షరాలతో కూడిన ఈ సందేశం ద్వారా ఆ పరికరాల పనితీరును పరీక్షించారు. రష్యా నుంచి వచ్చిన సందేశం మాత్రం అమెరికాలో వెంటనే ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే.. అది రష్యన్ భాషలో వచ్చింది. - ఈ హాట్లైన్ ఏర్పాటు చేసిన మూడు నెలలకే అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు గురయ్యారు. ఆ మూడు నెలల కాలంలో ఆయన ఒక్కసారి కూడా దీనిని ఉపయోగించలేదు. ఆయన తర్వాత అమెరికా అధ్యక్షుడైన లిండన్ జాన్సన్ 1967లో తొలిసారి దీనిని ఉపయోగించారు. ఇజ్రాయెల్కు, పొరుగున ఉన్న అరబ్ దేశాలకు మధ్య యుద్ధం తలెత్తినపుడు జాన్సన్ ఈ హాట్లైన్ ద్వారా రష్యా అధ్యక్షుడు అలెక్సీ కోసిగిన్ను సంప్రదించారు. - 1971 సెప్టెంబర్లో ఈ వ్యవస్థకు శాటిలైట్ కమ్యూనికేషన్ లైన్ను అనుసంధానం చేశారు. ఆ తర్వాత మూడు నెలలకు భారత్ – పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినపుడు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రష్యా అధ్యక్షుడు బ్రెజ్నేవ్తో మాట్లాడారు. మళ్లీ 1973లో ఒకసారి, 74లో మరోసారి అంతర్జాతీయ పరిణామాలపై నిక్సన్ ఈ హాట్లైన్ను ఉపయోగించి రష్యా అధ్యక్షుడిని సంప్రదించారు. - 1979లో అఫ్గానిస్థాన్పై రష్యా యుద్ధానికి దిగినపుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ హాట్లైన్ను ఉపయోగించారు. 1983లో రొనాల్డ్ రీగన్ చొరవతో హైస్పీడ్ ఫ్యాక్స్ సామర్థ్యంతో ఈ హాట్లైన్ వ్యవస్థను ఆధునీకరించారు. లెబనాన్, పోలండ్లలో ఘటనలపై సంప్రదించడానికి రీగన్ పలుమార్లు దీనిని ఉపయోగించారు.
ఇప్పుడది అత్యాధునిక హాట్ లైన్...
సోవియట్ పతనం తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినా ఈ హాట్ లైన్ వ్యవస్థ కొనసాగింది. అయితే దీనిని పెద్దగా ఉపయోగించలేదు. 2008 లో కొత్తగా ఫైబర్-ఆప్టిక్ వ్యవస్థతో ఆధునీకరించారు. కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లతో నూతన సాంకేతికతను జోడించారు. ‘హాట్ లైన్ స్థానంలో ట్వీటర్ వచ్చేసింది... ఎంతో కాలంగా ఉన్న రెడ్ ఫోన్లను ఇక పక్కన పారేయవచ్చునేమో!’ అని 2010లో రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్తో కలిసి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మీడియాతో మాట్లాడుతూ ఛలోక్తి విసిరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను గందరగోళ పరచడానికి రష్యా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారంటూ బరాక్ ఒబామా గత అక్టోబర్ నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఈ హాట్ లైన్ ద్వారానే సందేశం పంపించారు. భద్రమైన శాటిలైట్ కనెక్షన్లో ఒబామా తన సందేశాన్ని ఈమెయిల్ చేశారు. ఇంకో విశేషమేమిటంటే.. ఈ హాట్ లైన్ను ఏర్పాటు చేసినప్పటి నుండీ ఇప్పటివరకూ అమెరికా – రష్యాలు దీని ద్వారా గంట గంటకూ పరస్పరం సందేశాలు ఇచ్చిపుచ్చకుంటున్నాయి. అవన్నీ టెస్ట్ సందేశాలే!
Advertisement
Advertisement