సమయం లేదు మిత్రమా! | There is no time to stay in the earth | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా!

Published Sun, May 7 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

సమయం లేదు మిత్రమా!

సమయం లేదు మిత్రమా!

భూమ్మీద ఉండి అంతమైపోవడమా..
రెక్కలు విప్పుకుని ఎగిరిపోయి విశ్వమానవుడిగా మారిపోవడమా?


ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందేనంటున్న
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌
అంతకంతకూ మారిపోతున్న భూ వాతావరణం..
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న జనాభా..
కమ్ముకొస్తున్న అణు యుద్ధ భయం..  
విజృంభిస్తున్న కొత్త కొత్త వ్యాధులు
వీటిలో ఏదో ఒకటి కబళించకముందే..
ఇక ఏదో ఒక గ్రహానికి చేరకపోతే..
మానవజాతి కాలగర్భంలో కలిసిపోకతప్పదన్న హెచ్చరిక
ఐన్‌స్టీన్‌ తరువాత అంతటి ఈ శాస్త్రవేత్త అంచనా నిజమైతే..?
అందుకు మనిషి సిద్ధంగా ఉన్నాడా? ఉంటే.. ఏం చేయొచ్చు?
మనం వెళ్లగల గ్రహాలేవి.. అక్కడి పరిస్థితులేంటి?


రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. రానురాను విజృంభిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు.. గ్రహ శకలాలు, తోక చుక్కల వంటివి భూమిని ఢీకొనే అవకాశం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అస్థిరత.. అణు యుద్ధ భయం.. ఇలా అటు మానవ తప్పిదాలు.. ఇటు ప్రకృతి బీభత్సాలు మానవ జాతి వినాశనానికి హేతువు కానున్నాయి. భూమిపై జీవజాలం మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన ఉంది. ఐన్‌స్టీన్‌ తర్వాత అంతటి ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన స్టీఫెన్‌ హాకింగ్‌ ఇదే హెచ్చరిక చేస్తున్నారు. కొన్ని వందల ఏళ్లలోనే మనం భూమిని వదిలి మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి మనం మరో గ్రహానికి వెళ్లి నివసించడం సాధ్యమా?, చందమామపైకి వెళ్లాలా, అరుణగ్రహం మీదకెళ్లి బతకొచ్చా.. అనే ఎన్నో అంచనాలు, సందేహాలు, అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈ వారం ‘సాక్షి’ఫోకస్‌..
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మానవజాతి భవిష్యత్తు కోసం మనం ఇతర గ్రహాలకు చేరుకోవాల్సిందే. వందేళ్లలోపే వదిలి వెళ్లాల్సిందే. రోజురోజుకీ సున్నితంగా మారిపోతున్న భూమిపై మనిషి ఇంకో వెయ్యేళ్లు బతికితే గొప్ప..
– శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌

ఐదు కోట్ల రూపాయలతో అంగారకుడికి వెళ్లి రావచ్చు. అసాధ్యమేమీ కాదు. పదేళ్లలోపు చేసి చూపిస్తా.
– ఎలన్‌ మస్క్,స్పేస్‌ఎక్స్‌ సంస్థ అధ్యక్షుడు

భూమి వేడెక్కుతోంది..
మనిషికి భూమ్మీద నూకలు చెల్లిపోతాయన్న మాట వినడం భయం కలిగించేదే. కానీ పరిస్థితులు చూస్తోంటే స్టీఫెన్‌ హాకింగ్‌ అంచనా నిజమవుతుందనే అనిపిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటం భూతాపోన్నతికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూనే ఉంది. దాని ప్రభావం వాతావరణంపై తీవ్రస్థాయిలో కనిపించడం తథ్యమే. వాతావరణ మార్పుల ప్రభావం ఆహార ధాన్యాల దిగుబడులను తగ్గించడంతోనే ఆగిపోదు... అకాల వర్షాలు, వరదలు, సముద్ర మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతాల్లోని మహానగరాలు మునిగిపోవడం వంటివీ జరుగుతాయని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ తన తాజా నివేదికలో పేర్కొంది కూడా. ఇక పెరిగిన ఉష్ణోగ్రతలు దోమల వంటి వ్యాధికారక జీవజాతుల సంతతి మరింత పెరిగేందుకు దోహదపడి.. వ్యాధులూ విజృంభిస్తాయి. తీవ్ర వర్షాభావం, కరువుకు కారణమైన ఎల్‌నినో వరుసగా పంజా విసరడం మనం చూస్తూనే ఉన్నాం.

అరుణగ్రహమే దిక్కు!
కొన్నేళ్లలో జాబిల్లిపై మానవుడు స్థిర నివాసానికి అడుగు మోపగలిగితే తరువాతి లక్ష్యం అరుణగ్రహమే (మార్స్‌) అవుతుంది. భూమితో ఎన్నో పోలికలు ఉండటమే దానికి కారణం. మానవ మనుగడకు అత్యంత కీలకమైన నీరు ఆ గ్రహంపై ఉందా, లేదా అన్న అనుమానాలూ తొలగిపోయిన నేపథ్యంలో అది మరో భూమి అయ్యేందుకు అవకాశాలు పెరిగాయి. అందరూ ఊహించిన దానికంటే చాలా ముందుగానే అరుణగ్రహంపైకి మనిషిని పంపిస్తామని.. ఓ కాలనీనే కట్టేస్తామని స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష సంస్థ అధ్యక్షుడు, టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌ మస్క్‌ ఏడాది క్రితమే ప్రకటించిన విషయం గమనార్హం. రెండేళ్లకోసారి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అరుణ గ్రహాన్ని చేరుకోవచ్చని భారత్‌ ప్రయోగించిన మంగళ్‌యాన్, నాసా ప్రయోగించిన మావెన్‌ ఉపగ్రహాలు ఇప్పటికే నిరూపించాయి.

కాబట్టి సుదూర అంతరిక్ష ప్రయాణాల అవసరం ఉండదు. ఆ గ్రహపు మట్టిలో బంగాళా దుంపల్లాంటివి పండించుకోవచ్చని భూమిపై ప్రయోగపూర్వకంగా ఇప్పటికే నిరూపించారు. అమెరికాలోని మోజావే ఎడారి ప్రాంతంలో అంగారకుడిని పోలిన పరిస్థితులున్న చోట జరుగుతున్న పరిశోధనలు అరుణగ్రహంపై పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ శాస్త్రవేత్తలు ఒకట్రెండేళ్ల క్రితం కొంతమంది ఔత్సాహికులతో ఒక ప్రయోగం నిర్వహించారు. అందులో భాగంగా అరుణగ్రహాన్ని పోలిన పరిస్థితుల్లో కొంత మంది 500 రోజులపాటు ఒంటరిగా గడిపారు. వ్యోమగాముల సుదూర అంతరిక్ష ప్రయాణాల సందర్భంగా వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అంచనా.

సౌర కుటుంబానికి ఆవల కూడా..
జాబిల్లి, అంగారకుడు రెండూ సౌర కుటుంబంలోనే ఉన్న రెండు ఖగోళాలైతే... సౌర కుటుంబానికి ఆవల కూడా కోట్ల సంఖ్యలో గ్రహాలు ఉన్నాయి. వాటిలో మనిషి మనుగడకు అనువైనవి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ లెక్క తెలియదు. నాసా ప్రయోగించిన కెప్లర్‌ టెలిస్కోపు సహాయంతో ఇప్పటివరకు సౌర కుటుంబానికి ఆవల గుర్తించిన గ్రహాల సంఖ్య మూడు వేల దాకా ఉండగా.. వాటిలో గోల్డీలాక్‌ జోన్‌ (నక్షత్రం నుంచి నిర్దిష్ట దూరం)లో ఉన్నవి యాభైకిపైగా ఉన్నాయి. అయితే ఆ గ్రహాలపై ఉన్న వాతావరణం ఏమిటి? మనిషి బతికేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది. అయితే అవేవీ మనకు సమీపంలో ఉన్నవి కాదు. ఇప్పటివరకు గుర్తించిన గ్రహాల్లో చాలా దగ్గరగా ఉన్నదనుకునేది కూడా దాదాపు 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఓ రాకెట్‌లో కాంతివేగంతో ప్రయాణించినా ఆ గ్రహాన్ని చేరేందుకు 39 ఏళ్లు పడుతుందన్నమాట. కాంతివేగంతో ప్రయాణించగల రాకెట్‌ను తయారు చేయగలగడం ఇప్పుడున్న టెక్నాలజీ, పదార్థాలతో సాధ్యమయ్యే విషయం కాదు.అందువల్ల మనిషి ఇప్పటికైతే జాబిల్లి.. లేదంటే అరుణగ్రహంపై మాత్రం ఆశలు పెట్టుకుంటే చాలు!

ఇప్పటికే ఐదుసార్లు మహా వినాశనం!
భూమి ఏర్పడి దాదాపు 450 కోట్ల ఏళ్లవుతోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదుసార్లు మహా వినాశనాలు... అంటే జీవజాతుల్లో అధికశాతం కనుమరుగైపోవడం జరిగిందని అంచనా. గ్రహ శకలాలు ఢీకొనడంతో సుమారు 65 కోట్ల ఏళ్ల క్రితం రాక్షస బల్లులతోపాటు ఇతర జీవజాతులూ తుడిచిపెట్టుకుపోవడం వాటిల్లో ఒకటి. ఆ రకమైన ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉంది. విశాల విశ్వం నుంచి భూమివైపునకు దూసుకొచ్చే గ్రహశకలాలు ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. గత నెలలోనే దాదాపు రెండు వేల అడుగుల పొడవైన గ్రహశకలం (2014–జేఓ25) భూమికి అతిదగ్గరగా.. అంటే 18 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోయింది. ఇది చిన్నదే కావచ్చుగానీ.. ఐదు నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు ఉన్నవి ఢీకొంటే మాత్రం భూమి మీద జీవజాలం నిలిచే అవకాశాలు తక్కువ. 1908లో సైబీరియా ప్రాంతం వద్ద కొన్ని కిలోమీటర్ల సైజున్న గ్రహశకలం గాల్లో పేలిపోయినందుకే అక్కడ మనిషి బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని సైన్స్‌ చెబుతోంది.

నీళ్లు.. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయాలి..
గ్రీన్‌హౌస్‌ వాయువుల కారణంగా వాతావరణం కొంచెం దట్టంగా మారడంతోపాటు ఎక్కువ సమయం పాటు వేడి అక్కడే ఉండేందుకు అవకాశమేర్పడుతుంది. ఈ దశలో గ్రహంపై నీరు, ఆక్సిజన్‌ను భారీ ఎత్తున తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కో మనిషికి దాదాపు రోజుకు ఒక కిలోగ్రాము ఆక్సిజన్‌ కావాల్సి ఉంటుంది. దీంతోపాటు నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటివి కూడా అవసరమవుతాయి. అయితే వేడి పెరిగితే గ్రహగర్భంలోని మంచు కరిగి ఉపరితలంపైకి చేరుతుంది. కొంత నీరు ఆవిరై మేఘాలుగా మారతాయి. అనుకూల పరిస్థితుల్లో వర్షం కురిసి నదులు ప్రవహిస్తాయి.
► జన్యుమార్పిడి టెక్నాలజీ ద్వారా అంగా>రక వాతావరణానికి అనువైన మొక్కలను అభివృద్ధిచేసి ఉపయో గిస్తారు. వాటిద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి మరింత ఎక్కువ అవుతుంది.
► ప్రమాదకరమైన రేడియోధార్మిక కణాల నుంచి రక్షణ కల్పించే భారీసైజు పారదర్శక కట్టడాలు.. అటు మానవ ఆవాసాలుగా.. ఇటు పంటలు పండించేందుకు గ్రీన్‌హౌస్‌లుగా ఉపయోగపడతాయి.

జాబిల్లికి నిచ్చెన వేసి..
హాకింగ్‌ అంచనా వేసినట్టుగా మరో వందేళ్లలో భూమ్మీద మనిషి బతికే పరిస్థితి ఉండకపోతే ఎక్కడకు వెళ్లాలనే ప్రశ్న తలెత్తుతుంది. ముందుగా మన సహజ ఉపగ్రహం చందమామను నిచ్చెనగా చేసుకుని తర్వాత అంగారకుడిపైకి చేరుకోవాలని నిపుణులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ రెండుచోట్ల కూడా వాతావరణం మనిషికి అనుకూలం కాదు. అందువల్ల గ్రహ ఉపరితలంపై లేదంటే లోపల నివాస ప్రదేశాలు ఏర్పాటు చేసుకుని.. కృత్రిమ వాతావరణాన్ని సృష్టించుకుని కొద్దికాలం పాటు జీవించాల్సి ఉంటుంది. ఆలోపుగా టెరా ఫార్మింగ్‌ (బాక్స్‌ చూడండి) ప్రక్రియ ద్వారా వాతావరణాన్ని పూర్తిగా మార్చేయాల్సి ఉంటుంది. ఈ ఆలోచనను అమలు చేసేందుకు ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఒకవైపు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) 2030 నాటికల్లా జాబిల్లిపై ఒక చిన్నపాటి మానవ కాలనీని కట్టేందుకు ఇప్పటికే సంకల్పం చెప్పుకుంది. అంగారకుడితోపాటు ఇతర సుదూర గ్రహాలను చేరుకునేందుకు జాబిల్లిపై కాలనీని వేదికగా మార్చుకోవాలన్నది ఆలోచన. ఇతర గ్రహాలకు వెళ్లేందుకు అవసరమైన ఇంధనంగా.. జాబిల్లిపై విస్తృతంగా అందుబాటులో ఉన్న హీలియం–3 వాయువును వాడుకోవచ్చని భావిస్తున్నారు. నాసాతోపాటు చైనా, జపాన్‌లు కూడా జాబిల్లిపై మకాం పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. గ్రహం లోపలి భాగంలో ఉన్న నీటిని వాడుకునేందుకు, రోబోల సాయంతో ఆవాసాలు, గ్రీన్‌హౌస్‌ల వంటివి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. జాబిల్లిపై మట్టితో ఇటుకల్లాంటివి తయారు చేయడం ఎలా? పంటలు పండించే గ్రీన్‌హౌస్‌లు ఎలా ఉండాలి?.. వంటి అనేక అంశాలపై వివిధ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే పరిశోధనలు చేపట్టాయి కూడా.

అంగారకుడిని భూమిలా మార్చే టెరా ఫార్మింగ్‌
అరుణ గ్రహంపై భూమిలాంటి వాతావరణాన్ని సృష్టించడం, ఆ గ్రహాన్ని వెచ్చబెట్టడంతో మొదలవుతుంది. ఇందుకు అనేక మార్గాలున్నాయి. ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు పెరిగితే చాలు.. కాలక్రమంలో గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ కారణంగా వాతావరణ పీడనం మనం తట్టుకోగల విధంగా మారుతుంది.

బాగా హెచ్చుతగ్గులు..
చలికాలంలో మార్స్‌ ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు –125 డిగ్రీలకు తగ్గిపోతాయి. వేసవిలో అంగారక మధ్య రేఖ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకూ ఉంటాయి. రాత్రివేళల్లో  –73 డిగ్రీలకు తగ్గిపోతాయి. ఇంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా జీవజాలం మనుగడ కష్టం.

తోకచుక్కలతో ఢీకొట్టించడం..
అంగారక గ్రహాన్ని తోకచుక్కలతో ఢీకొట్టించడం ద్వారా అక్కడి ఉష్ణోగ్రతలు పెరిగేలా చేస్తారు. దీంతో గ్రహ అంతర్భాగంలోని నీరు, కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతాయి. భూమిలాంటి వాతావరణం ఏర్పడేందుకు అది తొలిమెట్టు అవుతుంది.

అమ్మోనియా గ్రహశకలాలకు రాకెట్లు
టెరాఫార్మింగ్‌కు ఉన్న మరో మార్గం అమ్మోనియా ఎక్కువగా ఉన్న గ్రహ శకలాలకు అణుబాంబుల వంటివి జోడించి అంగారకుడిని ఢీకొట్టించడం. ఆ చర్య ద్వారా గ్రహ శకలాల్లోని అమ్మోనియా, నీరు అరుణగ్రహంపైకి విడుదలవుతుంది.

ధ్రువ ప్రాంతాలపై అణు బాంబులు
అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లోని మంచును నీటిగా కరిగించి ఆ గ్రహాన్ని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు అణు బాంబులను ఉపయోగించాలన్న ఆలోచన ఉంది.

సూర్యరశ్మిని మరల్చి..
అంగారకుడి కక్ష్యలో భారీసైజు అద్దాలాంటివి ఏర్పాటు చేసి.. ఎక్కువ సూర్యరశ్మి ఉపరితలంపైకి చేరేలా చేయడం, తద్వారా ఉష్ణోగ్రతలను 5 డిగ్రీల వరకూ పెంచడం మరో మార్గం.

ఫ్యాక్టరీలు పెట్టి..
మార్స్‌పై గ్రీన్‌హౌస్‌ వాయువులను పెంచేందుకు ఫ్యాక్టరీల ఏర్పాటు యోచ న ఉంది. సౌరశక్తితో పనిచేసే ఈ ఫ్యాక్టరీ లు అక్కడి మట్టి, గాలి నుంచి క్లోరోఫ్లూరో కార్బన్లను తీసి విడుదల చేస్తాయి.

బ్యాక్టీరియా సాయం..
అరుణ గ్రహ వాతావరణానికి అలవాటు పడ్డ బ్యాక్టీరియా సాయంతో వాతావరణ ఏర్పాటుకు తగ్గట్టుగా గ్రీన్‌హౌస్‌ వాయువులను ఉత్పత్తి చేస్తారు. ఆ క్రమంలోనే ఈ బ్యాక్టీరియా నీటి లభ్యతను పెంచేందుకు, పంటలు పెంచేందుకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది.
► టెరాఫార్మింగ్‌ కోసం రకరకాల యంత్రాలు అవసరం అవుతాయి. వాటన్నింటినీ నడిపేందుకు అవసరమైన ఇంధనా న్ని కూడా అక్కడే తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంత కాలం పడుతుంది?
అంగారకుడిపై మనిషి ఊపిరితీసుకోగల వాతావరణం రావాలంటే లక్ష ఏళ్లు పడుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు అంటూంటే.. ఇంకొందరు వెయ్యేళ్లలోపే ఈ పని చేసేయవచ్చని అంటున్నారు.

మార్స్‌పై ఒక రోజు: 24 గంటల 37 నిమిషాలు
ఏడాది: 687 రోజులు
సగటు ఉష్ణోగ్రత: –60 డిగ్రీల సెల్సియస్‌
సగటు కక్ష్య వేగం: సెకన్‌కు 24.077 కి.మీ.


ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిందే..
భూమి, మార్స్‌ల మధ్య చాలా విషయాల్లో పోలికలున్నా.. అంతే స్థాయిలో ప్రతికూల అంశాలూ ఉన్నాయి. ఇవన్నీ మార్స్‌ను మరో భూమిగా మార్చే విషయంలో సవాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

జాబిల్లి తోడు ఉండదు
భూమికి సహజ ఉపగ్రహంగా ఉన్న చంద మామ ద్వారా ఎన్నో ప్రయోజనాలు న్నాయి. అంగారకుడిపై అలాంటి పరిస్థితి ఉండదు. అందువల్లే కొన్ని లక్షల ఏళ్ల కాలంలో అంగారకుడిపై వాతావరణం దెబ్బతినడంతోపాటు ధ్రువ ప్రాంతాల్లోని మంచు కొంచెం గ్రహం మధ్యకు చేరుకుంది.

గ్రహ శకలాల ప్రమాదం కూడా..
భూమితో పోలిస్తే మార్స్‌ ఆస్టరాయిడ్‌ బెల్ట్‌ (గ్రహశకలాలు ఎక్కువగా ఉండే ప్రాంతం)కు దగ్గరగా ఉంది. అంటే వాటిలో కొన్ని ఆ గ్రహాన్ని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అదుపు తప్పితే..
వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు పెంచే గ్రీన్‌హౌస్‌ వాయువులు మితిమీరితే.. అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా అననుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు.

విపరీత వాతావరణం
మార్స్‌కు ఉన్న దీర్ఘ వృత్తాకార కక్ష్య కారణంగా ఆ గ్రహంపై వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఉత్తర భాగంలో వేసవిలాంటి పరిస్థితులు ఉంటే దక్షిణంలో చల్లటి వాతావరణం ఉంటుంది. దీనివల్ల రెండేళ్లకు ఒకసారి ఇసుక తుపానుల్లాంటివి చెలరేగుతాయి.

కార్బన్‌ డయాక్సైడ్‌తో చిక్కే..
ఆ గ్రహ వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ అధిక శక్తిగల సూర్యకిరణాల కారణంగా సున్నపురాయి లేదా వేర్వేరు రకాల కాల్షైట్‌ల రూపంలోకి మారిపోతుంది. కార్బన్‌ డయాక్సైడ్‌ లేకపోతే మొక్కల పెంపకానికి ఇబ్బందులేర్పడతాయి.

మార్పులూ ఎక్కువ..
టెరా ఫార్మింగ్‌ పూర్తయిన తరువాత అక్కడి వాతావరణం ఎలా ఉంటుందన్న అంశంపై ఇంకా మోడలింగ్‌ జరగలేదు. రెండు భాగాల్లో ఉన్న విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా మార్పులు కూడా చాలా తీవ్రంగా, అనూహ్యంగా ఉండే అవకాశముంది.

హానికారక జీవులు
వాతావరణం మారిపోయే క్రమంలో అంగారక గ్రహంపై ఇతర జీవులకు అంటే మానవులకు హాని కలిగించగల కొత్త కొత్త జీవజాతులు పుట్టుకొచ్చే అవకాశమూ ఉంటుంది. కృత్రిమంగా సృష్టించిన వాతావరణం ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది? ఎంత కాలం ఉంటుంది? అకస్మాత్తుగా వ్యవస్థ మొత్తం నాశనమైపోతుందా?... తెలియదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement