ఈ అలారం కాఫీ ఇస్తుంది..
లండన్: మనం ఉదయాన్నే నిద్రలేచేందుకు రాత్రి పూట అలారం పెట్టిపడుకుంటాం అదంతా మామూలే. అయితే అలారం మోగగానే లేచిన వెంటనే వేడి వేడి కాఫీ ఇస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదూ.. ఇంతకీ కాఫీ ఎవరిస్తారనేగా ప్రశ్న.. అయితే తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్రలేపి కాఫీ ఇచ్చే అలారంను కనుగొనాలనుకున్నాడు లండన్‌కి చెందిన జోషున రెనోఫ్. ‘బరిసూర్ అలారం క్లాక్’అనే సరికొత్త అలారం రూపొందించాడు. దానిపై ఒక గాజుపాత్ర, నీటిని వేడిచేసేందుకు దాని అడుగున రెండు స్టీల్ బాల్స్ ఉంటాయి. ఆ గాజుపాత్రలో వేడి అయిన నీళ్లు స్టెయిన్‌లెస్ స్టీల్ ఫిల్టర్‌లో పడతాయి.
రాత్రి పడుకునేముందు ఫిల్టర్‌లో కాఫీ లేదా టీ పొడి నింపుకుని దాని పక్కనే ఉండే చిన్న గ్లాసులో పాలను పోసిన తర్వాత అలారం పెట్టుకోవాలి. అలారం సమయానికి ఈ క్లాక్ పనిచేయడం ప్రారంభమవుతుంది. వెంటనే నీళ్లు వేడి అయి కాఫీ, టీ పొడి ఉన్న ఫిల్టర్‌లోకి వస్తాయి. దీంతో డికాషన్ తయారై ఫిల్టర్ కింద ఉన్న కప్‌లో వచ్చి చేరి అలారం మోగుతుంది. ఇంకేముంది నిద్ర లేచి పక్కనే ఉంచిన పాలను కలుపుకుని వేడి వేడి కాఫీ తాగవచ్చు. ఈ అలారం క్లాక్ వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని జోషున ప్రయత్నిస్తున్నారు.