ఇది మొసళ్లకే రాజానా!
మొసలి లాంటి శరీరం.. రాక్షస బల్లుల సైజులో దేహం.. కోటానుకోట్ల ఏళ్ల క్రితం ఆఫ్రికా ఖండం పక్కనే ఉన్న మడగాస్కర్ ప్రాంతంలో తిరిగిన భయంకర జీవి వర్ణన ఇది. ‘రాజానా’అని ముద్దుగా పిలుస్తున్న ఈ జీవి ఏకంగా 23 అడుగుల పొడవు ఉండేదని, వెయ్యి కిలోల బరువు తూగేదని.. ఇటలీకి చెందిన పాలియంటాలజిస్ట్ట్ క్రిస్టియానో డాల్ సాసో అంటున్నారు. రాజానా అవశేషాలు ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే బయటపడ్డాయి. అయితే వీటిని కొంతమంది వ్యక్తులు తమ అధీనంలో ఉంచుకోవడంతో ఇప్పటివరకూ విశ్లేషించడం సాధ్యం కాలేదు. రాక్షస బల్లుల మాదిరే రాజానా కూడా ఇతర జంతువులను వేటాడేదని, దీని ఒక్కో పన్ను దాదాపు 15 సెంటీమీటర్ల పొడవు ఉంటుండేదని క్రిస్టియానో అంటున్నారు.
పుర్రె ఎముకలను బట్టి దీని శరీర నిర్మాణం ఇప్పటి మొసళ్ల కంటే భిన్నంగా ఉందని, హైనా మాదిరిగా ఇది కూడా జిత్తులమారి జంతువయ్యేందుకు అవకాశముందని వివరించారు. వేగంగా పరుగెత్తే సామర్థ్యం లేకపోయినప్పటికీ కాపుకాచి వేటాడటం, లేదా ఇతర జంతువులు వేటాడి వదిలేసిన ఆహారాన్ని తీసుకునేదని అంచనా వేస్తున్నారు. రాక్షస బల్లుల తరహాలోనే భారీ జంతువైన రాజానా సుమారు 17 కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద మనుగడ సాగించిందని అంచనా.