ఈ రోబోలు మరింత సురక్షితం!
లండన్: రానున్న రోజుల్లో నర్సుల స్థానంలో రోబోలే రోగులకు సంరక్షకులుగా మారనున్నాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత టెక్నాలజీలో మార్పులు చేయడం ద్వారా రోబోలను రోగులకు సహాయపడేలా చేయవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య, సంరక్షకుల వేతనాలు పెరిగే అవకాశం ఉండే నేపథ్యంలో రోబోలే అసిస్టెంట్‌లుగా మారతాయని నెదర్లాండ్స్‌ల్లోని ట్వంటీ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఇప్పటికే రోబోలు అంగవైకల్యం ఉన్న వారికి రోజువారి పనుల్లో సహాయపడుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉన్న రోబోలు దృఢంగా ఉండటంతో సరళంగా ఉండవని, చేసిన పనుల్నే మళ్లీ చేస్తుండడంతో సంరక్షకులుగా పనిచేయడానికి సరిపోయేవి కావని చెప్తున్నారు. ఇప్పటి రోబోలకు ఎలాస్టిక్ స్ప్రింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా సురక్షితమైనవిగా మార్చవచ్చని తెలిపారు. ఈ టెక్నాలజీని ఇంతకుముందు ఉపయోగించ లేదని, ఈ సరికొత్త టెక్నాలజీతో రోజువారీ పనుల్ని రోబోలు సురక్షితంగా నిర్వర్తిస్తాయని చెబుతున్నారు.