కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ | Tiger in US zoo tests positive for coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్

Published Mon, Apr 6 2020 11:58 AM | Last Updated on Mon, Apr 6 2020 4:14 PM

Tiger in US zoo tests positive for coronavirus - Sakshi

నదియా (ఫైల్ ఫోటో)

న్యూయార్క్ : ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న ముఖ్యంగా అమెరికాను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ తాజాగా మరో షాక్ ఇచ్చింది. మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని  ఇప్పటివరకు భావిస్తున్న తరుణంలో మొదటి సారి జంతువులకు  సోకడం మరింత ఆందోళన రేపుతోంది. న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూ లోని  నదియా అనే ఆడపులి (4) ఈ వైరస్ బారిన పడింది.  పొడిదగ్గు రావడంతో అప్రమత్తమైన జూ అధికారులు పరీక్షలు  నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు నదియా మరో  ట్విన్ స్టిసర్ అజుల్, రెండు అముర్ పులులతోపాటు మూడు ఆఫ్రికన్ సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. ఇది తనను షాక్ కు గురి చేసిందని, నమ్మలేక పోతున్నానని జూ డైరెక్టర్ జిమ్ బ్రెహనీ అన్నారు. నదియాకు మార్చి 27న కోవిడ్ -19 లక్షణాలు ప్రారంభమయ్యాయనీ, ప్రస్తుతం అన్నీ బాగానే ఉన్నాయని త్వరలోనే కోలుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.  

రోజూ వీటి బాగోగులు చూసే ఉద్యోగి ద్వారా ఈ వైరస్ సోకినట్టుగా వైల్డ్ లైఫ్ సొసైటీ అధికారులు భావిస్తున్నారు.  ఇన్ఫెక్షన్లకు వివిధ జాతులకు చెందిన జంతువులు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతాయని, కానీ ఈ క్రూర జంతువులకు ఈ మహమ్మారి ఎలా సోకిందో తెలియడంలేదని ఈ జూ నిర్వాహకులు అంటున్నారు.  మరోవైపు కరోనావైరస్ తో బాధపడుతున్న వ్యక్తులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ జంతువులకు దూరంగా ఉండాలని అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ,  ఫెడరల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు సిఫారసు చేశారు.  తాజా ఘటనతో జంతువులను ముట్టుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పెంపుడు జంతువులను, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని మరోసారి పునరుద్ఘాటించారు. వివిధ జంతు జాతుల సెన్సిబిలిటీని అర్థం చేసుకోవడానికికొంతమంది పరిశోధకులు ప్రయత్నిస్తున్నారనీ,  అలాగే జూలలో ఇది ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంస్థ తెలిపింది.  

కరోనా  వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందనడానికి ఆధారాలు లేనప్పటికీ, పెంపుడు జంతువుల యజమానుల నుంచి  వాటికి సోకే అవకాశం వుందని జంతు నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు బెల్జియంలో ఒక పిల్లికి, హాంకాంగ్ లో రెండు శునకాలకు వాటి యజమానుల నుంచి కరోనా వైరస్ సోకిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. కాగా న్యూయార్క్ లో  అంతకంతకూ పెరుగుతున్నకరోనా కేసుల కారణంగా మార్చి 16  నుంచి ఈ జూను  మూసివేశారు.

చదవండి : లాక్‌డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement