
టైమ్స్ జాబితాలో మాలియా, మలాలా
2013 యువ ప్రభావశీలుర జాబితా విడుదల
న్యూయార్క్: టైమ్స్ మాగజైన్ రూపొందించిన అత్యంత ప్రభావశీలురైన యువత జాబితా-2013 లోని తొలి 16 మందిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మాలియా, పాక్‌లో బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమిస్తున్న మలాలా యూసఫ్‌జాయ్‌ల పేర్లు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ అసాధారణమైన కృషి, అభినివేశాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన పలువురు యువ గాయకులు, క్రీడాకారులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ప్రముఖులతోపాటు అసాధారణ మేధస్సు కనబరచిన బాలలు, యువ రచయితలకు ఈ జాబితాలో స్థానం దక్కింది.
విస్తృత జీవితానుభవం కలిగిన పెద్దల మాదిరిగా పరిణతితో, హుందాగా వ్యవహరిం చడంలో మాలియా(15), ఆమె చెల్లెలు సాషా సుప్రసిద్ధులు. పురుష స్వలింగ సంపర్కులకు వివాహ హక్కు కల్పించడం వంటి అనేక అంశాలలో తన కుమార్తెలు తన ఆలోచనలను ప్రభావితం చేశారని ఒబామా తరచూ తన ప్రసంగాల్లో పేర్కొంటూ ఉంటారు.