'టైమ్' మేటి వ్యక్తుల జాబితాలో నరేంద్రమోడీ!
టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ఈ సంవత్సరపు మేటి వ్యక్తుల ఎంపిక జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి స్థానం దక్కింది. టైమ్ జాబితాలో భారత తరపున స్థానం దక్కించుకున్న ఏకైక నేతగా మోడీ ఘనతను సాధించారు. ఈ ఏటి మేటి వ్యక్తుల కోసం ప్రపంచవ్యాప్తంగా 42 మంది నేతలను, వ్యాపారవేత్తలను, సెలబ్రిటీలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాకిస్థానీ టీనేజ్ సంచలనం మలాలా యూసఫ్ జాయ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెంజోస్, ఎన్ఎస్ఏ కు చెందిన ఎడ్వార్డ్ స్నోడెన్ లకు స్థానం దక్కింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్న నేత, హిందుత్వ నాయకుడు అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపై టైమ్ వ్యాఖ్యలు చేసింది. టైమ్ ఎంపిక చేసిన జాబితాలో భారత తరపున మోడీ ఒక్కరికే స్తానం లభించడం విశేషం. ఆన్ లైన్ లో నిర్వహించిన సర్వేలో మోడీకి 2650 పైగా ఓట్లు వచ్చాయని టైమ్ తెలిపింది. ఈ జాబితాలో ఎంపికైన వ్యక్తుల నుంచి విజేతను టైమ్స్ ఎడిటర్స్ ప్రకటిస్తారని తెలిపారు.