'ఆ చిన్న పని మీ ఊళ్లోనే చేసుకొండి'
ఓ బుడ్డోడు రోడ్డు మీద చిన్న పని కానిచ్చాడు. మనకైతే ఇది చాలా మామూలు విషయం. చెడ్డీ పైకి లాగి 'గుడ్ బాయ్... బట్టలు ఖరాబు చేసుకోలేదు. చెప్పి రోడ్డు మీద పని చేశావు... ' అని మెచ్చుకుంటాం కూడా.
కానీ హాంకాంగ్ లో ఇప్పుడీ చిన్న పనే పెద్ద వివాదానికి దారి తీస్తోంది. హాంకాంగ్ ఈ మధ్యే చైనాలో కలిసింది. అక్కడ ఇలాంటివి నిషిద్ధం. కానీ చైనాలో మాత్రం చిన్న పిల్లల వరకూ ఇది ఓకే. దాంతో హాంకాంగ్ ప్రజలు చైనా మెయిన్లాండ్ ప్రజలను వేళాకోళం చేస్తున్నారు.
ఇదిగో... ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోయే ప్రస్తుతం వివాదానికి కారణం. మెయిన్ లాండ్ చైనా ప్రజలు వచ్చి హాంకాంగ్ ను ఖరాబు చేస్తున్నారంటూ ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఓ పాపులర్ షాపింగ్ సెంటర్ అయితే ఏకంగా రోడ్డుపై చిన్న, పెద్ద పనులు చేస్తున్న మెయిన్ లాండ్ ప్రజల ఫోటోలతో ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్వహించేసింది. దీనిలో ఏకంగా 800 మంది పాల్గొన్నారు.
మెయిన్ లాండర్లు మాత్రం దీనిపై భగ్గుమంటున్నారు. 'చిన్న పిల్లలకు ఏం తెలుసు. బ్లాడర్ బద్దలైపోతుంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారు?' అని వారు సర్దిచెబుతున్నారు.
'దయచేసి వాష్ రూమ్ లు ఎక్కడున్నాయో స్పష్టంగా తెలిసేలా కొంచెం ఎక్కువ సైన్ బోర్డులు పెట్టండి మహాప్రభో' అంటూ మెయిన్ లాండర్లు వేడుకుంటున్నారు. అయితే 'అంత మంది చూస్తూండగా పిల్లలతో ఆ పని చేయించడం సరైన పనేనా?' అంటూ హాంకాంగ్ నివాసులు ఆక్షేపిస్తున్నారు.
మొత్తం మీద చిన్నోడు చేసిన చిన్న పని పెద్దోళ్ల మధ్య పెద్ద వివాదమై, ఆఖరికి జాతీయస్థాయి కాంట్రవర్సీ గా మారి, అంతర్జాతీయ మీడియా వరకూ పాకేసింది. అదే మనదగ్గరైతేనా....?