
ఎంత ధైర్యం రా ఢింబకా
లండన్: ఒళ్లు వేడయితేనే పిల్లలు తల్లడిల్లి పోతారు. ఇంజెక్షన్ తీసుకోవాలంటే గావు కేకలు వేస్తారు. అలాంటిది లింకన్‌షైర్‌కు చెందిన ఆలివర్ చాప్‌మన్ అనే బాలుడు కీమో థెరపి, ఫిజియో థెరపి, బయాప్సిస్, స్కాన్స్, ఆపరేషన్స్, ఇంజెక్షన్స్ ఇలా రోజుకు నాలుగు చొప్పున ఇంతవరకు 1500 సార్లు వైద్య ప్రిక్రియను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇన్ని పరీక్షలు, ఇన్ని శస్త్ర చికిత్సలు జరిగాయా? అన్న అంశం వైద్యం చేసిన డాక్టర్లకు గుర్తు లేకపోయినా, ఆలివర్‌కు, ఆ బాలుడి తల్లి డనిఎల్లి హార్పర్(33)కు బాగా గుర్తు. ఎందుకంటే...ఒక్కో వైద్య పరీక్షకు ఒక్కో పూసను, విభిన్న ప్రక్రియకు మరో రంగు పూసను బాలుడు కలెక్ట్ చేస్తూ రావడమే.
ఇప్పటివరకు బాలుడు సేకరించిన మొత్తం పూసల సంఖ్య 1500 కాగా, అందులో 17 వేర్వేరు రంగులు ఉన్నాయి. అంటే..17 భిన్నమైన వైద్య ప్రక్రియలతో చికిత్స చేశారన్నమాట. తల్లి హార్పర్, ఓ ప్లే మాస్టర్ సహకారంతో ఆ బాలుడు ఈ పూసలను సేకరించాడు. వైద్య చికిత్స సందర్భంగా బాధను మరచిపోయేందుకు ఆ బాలుడికి ఓ ప్లే మాస్టర్ ఈ విధానాన్ని అలవాటు చేశారు. ఇప్పుడు ఆ బాలుడు తన అనారోగ్యం గురించి అసలు బాధ పడడం లేదు. తాను సేకరించిన రంగురంగుల పూసలు చూసి మురసిపోతున్నాడు. వాటితోనే ఆడు కుంటున్నాడు. వైద్య చికిత్సల సందర్భంగా పిల్లలకు బాధ తెలియకుండా మనసు మళ్లించేందుకు అమెరికా, జపాన్, న్యూజిలాండ్ దేశాల్లో ఇప్పటికే ఈ పూసల సేకరన విధానం అమల్లో ఉండగా, ఇప్పడిప్పుడే లండన్‌లో కూడా విస్తరిస్తోంది.
వైద్య పరిభాషలో ‘లాంగర్‌హాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్ (ఎల్‌సీహెచ్) వ్యాధితో ఆలివర్ బాధ పడుతున్నాడు. ఇది క్యాన్సర్‌కానీ క్యాన్సర్ జబ్బు. ఎక్కువ వరకు చర్మానికి వస్తుంది. ఈ సెల్స్ శరీరంలో ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ చర్మం పుండుగా మారుతుంది. లండన్‌లో ఏడాదికి 50 మంది పిల్లలకు ఈ జబ్బు వస్తోంది.వారిలో 80 నుంచి 83 మందికి జబ్బు నయం అవుతుంది.
దీనికి క్యాన్సర్ నిపుణులే చికిత్స చేస్తారు. ఎక్కువ వరకు కీమో థెరపితోనే నయం అవుతుంది. 20 నెలల ప్రాయంలోనే ఈ వ్యాధి వచ్చిన ఆలివర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కీమో థెరపి పూర్తిగా నయం చేయలేకపోతోంది. దాంతో వైద్యుల సలహాపై గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పటల్‌కు బాలుడిని మార్చారు. ఓ ఏడాది పాటు అక్కడ ఆలివర్‌కు చికిత్స అవసరం అవుతుంది. ఈలోగా బాలుడు పారిస్‌లోని డిస్నీల్యాండ్‌ను సందర్శించాలనుకుంటున్నాడు. అందుకు ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ సహకరిస్తోంది.