
ట్రంప్‌కు అగ్ని పరీక్ష
అమెరికన్ రాజకీయాలపై ప్రభావం చూపనున్న ‘రెండో సూపర్ ట్యూస్‌డే’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన నేతలంతా ‘రెండో సూపర్ ట్యూస్‌డే’ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా పార్టీలో తన ప్రత్యర్థులందరినీ వెనక్కినెట్టి దూసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఇది అగ్నిపరీక్షే. మంగళవారం కీలకమైన ఐదు రాష్ట్రాలు.. ఫ్లారిడా, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, మిస్సోరి, ఒహయోల్లో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 360 మంది ప్రతినిధులు ఎవరి పక్షాన నిలుస్తారనేది ఆసక్తికరంగా ఉంది. మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి 2,472 మంది ప్రతినిధులున్నారు. అధ్యక్ష అభ్యర్థి కావాలంటే వీరిలో 1,237 మంది మద్దతు ఉండాలి.ఇప్పటికి ఈ రేసులో ట్రంప్ (460) ముందంజలో ఉండగా.. టెడ్ క్రుజ్ (367), రుబియో (153), ఒహయో గవర్నర్ జాన్ కాషిష్ (63) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్
విద్వేషపూరిత వ్యాఖ్యలతో ట్రంప్ ఇంటా, బయటా తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. పైగా ఇటీవల జరిగిన వాషింగ్టన్ డీసీ, వ్యోమింగ్ రాష్ట్రాల్లో ఆయన ఘోర పరాజయాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మిట్ రోమ్నీవంటి సీనియర్లు మిగతా అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ట్రంప్‌ను 1,237 మంది బలపరచకుండా అడ్డుకోగలిగితే జూలైలో జరిగే పార్టీ కన్వెన్షన్‌లో నాయకుల అభిప్రాయం మేరకు అభ్యర్థిని ఖరారు చేస్తారు. మెజారిటీ రిపబ్లికన్ నాయకులు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నందున ఆయన అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ ముందంజలో ఉండటం కేవలం రిపబ్లికన్లనే కాదు అటు డెమోక్రాట్లను, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా కలవరపరుస్తోంది. తన వారసుడిగా ట్రంప్‌ను అమెరికన్లు ఎన్నుకోరని ఆయన విశ్వసిస్తున్నారు. అమెరికాకు వలస వచ్చినవారు ట్రంప్ విషయంలో ఆందోళనగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ట్రంప్ ర్యాలీల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అం దుకే ట్రంప్ కూడా భారతీయుల గురించి స్వరం మార్చారు. అమెరికా విద్యాలయా ల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తెలివైన వారని, వారిని వెనక్కి పంపరాదని, అలా పంపితే మనకే నష్టమని అన్నారు.