సూర్యభగవానుని సౌధం | towers in melbourne | Sakshi
Sakshi News home page

సూర్యభగవానుని సౌధం

Published Fri, Sep 9 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

ఇన్వెక్టస్ టవర్ నిర్మాణం పూర్తయితే మెల్ బోర్న్ నగరం ఇలా దేదీప్యమానం అవుతుంది.

ఇన్వెక్టస్ టవర్ నిర్మాణం పూర్తయితే మెల్ బోర్న్ నగరం ఇలా దేదీప్యమానం అవుతుంది.

ఇది ఇన్వెక్టస్ టవర్. ఇన్వెక్టస్ అంటే లాటిన్‌లో ‘అన్ కాంకరబుల్’ అని, ‘అన్ డిఫీటబుల్’ అని కూడా. అంటే ఎవరూ జయించలేనిది, ఎవరూ ఓడించలేనిది అని అర్థం. బహుశా భవిష్యత్తులో ఎదురవబోయే విద్యుత్  కొరత ఈ టవర్‌లో ఉండే (ఉండబోయే) నివాస గృహాలపై ఏ విధంగానూ ప్రభావం చూపలేదనే అర్థంలో ఇలా ‘ఇన్వెక్టస్ టవర్’ అని పేరు పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే.. కరెంట్ లేకపోయినా, ఈ టవర్ తన సొంత కరెంటును తయారుచేసుకుంటుంది! హౌ? ఎలా? చదవండి.
 
 వంద అంతస్తుల భవనాన్ని చూశాం... అంతకంటే పెద్దదైన బుర్జ్ ఖలీఫానూ చూశాం. వాటితో పోలిస్తే ఫొటోలో కనిపిస్తున్న సోల్ ఇన్వెక్టస్ టవర్ పెద్దదేమీ కాదు. అరవై అంతస్తులు మాత్రమే ఉంటుంది ఇది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో దీన్ని నిర్మించనున్నారు.

మరి ఏమిటి దీని ప్రత్యేకత అంటున్నారా? చాలా వరకూ ఆకాశహర్మ్యాల మాదిరిగానే దీంట్లోనూ చుట్టూ అద్దాలు కనిపిస్తున్నాయా? నిజానికి అవి అద్దాలు కానేకాదు. సోలార్ ప్యానెల్స్! ఇంకోలా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ప్రతి ఇంటిలో ఒక గోడకు బదులు సోలార్ ప్యానెల్స్ ఉంటాయన్నమాట. సాధారణంగా మనం సూర్యుడి వేడి తగలకుండా కర్టెన్స్ వాడతాం.
 
కానీ సోలార్ ఇన్వెక్టస్ టవర్‌ను వీలైనంత ఎక్కువ సూర్యరశ్మి తగిలేలా కోడిగుడ్డు ఆకారంలో డిజైన్ చేశారు. భవనం చుట్టూ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ సూర్యుడి వేడి నుంచి రక్షణ కల్పిస్తూనే అదనంగా విద్యుత్తునూ ఉత్పత్తి చేస్తాయి. భవనం విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటే దీనిపై దాదాపు 400 చదరపు మీటర్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే అవకాశముండేది.

అయితే అన్నివైపులా ఉన్న ఫసాడ్ (బయటికి కనిపించే అద్దాల గోడ) కూ వీటిని వాడటం వల్ల ఈ విస్తీర్ణం 3500 చదరపు మీటర్లకు పెరిగింది. ఫలితంగా భవన విద్యుత్తు అవసరాల్లో సగానికిపైగా సూర్యుడే అందిస్తున్నట్లు అయింది. పెడెల్ థార్ప్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసిన సోల్ ఇన్వెక్టస్ టవర్ మరో మూడు నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. మరింత సమర్థమైన బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఇంకా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసి వాడుకోవచ్చునని సంస్థ ప్రతినిధి బ్రూక్ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement