జపాన్ చక్రవర్తితో అమెరికా అధ్యక్షుడు, ఫస్ట్ లేడీల కరచాలనం
టోక్యో: ఆసియా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు జపాన్ చక్రవర్తితోపాటు ఆ దేశ ప్రధాని షింజో అబేతో సోమవారం భేటీ అయ్యారు. చక్రవర్తి నివాసం ఇంపీరియల్ ప్యాలెస్‌లో అధ్యక్ష దంపతులకు ఘనస్వాగతం లభించింది. తదనంతరం ఆయన అబేతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఉత్తర కొరియాతో ఇతర అంతర్జాతీయ సమస్యలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఉత్తర కొరియా అపహరించిన జపనీయులను విడిపించడంపైనా సమాలోచనలు చేశారు.
అమెరికా, జపాన్ వాణిజ్యవేత్తలతో ట్రంప్ ఈ సందర్భంగా భేటీ అయ్యారు. జపాన్‌తో స్వేచ్ఛా వాణిజ్యాన్ని కోరుకుంటున్నామని అమెరికా అధిపతి అన్నారు. తరచూ అణుపరీక్షలతో అమెరికా, దాని మిత్రపక్షాలను ఉత్తర కొరియా భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జపాన్ చేరుకుకున్న ట్రంప్ టోక్యోలోని యొకోటా ఎయిర్ బేస్‌లో మాట్లాడుతూ...‘ఏ నియంత, ఏ ప్రభుత్వం, ఏ దేశం కూడా అమెరికా దృఢ సంకల్పాన్ని తక్కువగా చూడొద్దు’ అని అన్నారు. జపాన్, చైనా సహా పలు ఆసియా దేశాల్లో ట్రంప్ 12 రోజులపాటు పర్యటిస్తారు. ఇదిలా ఉంటే, ఉత్తర కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో గుర్తించి, స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడి చేయడమే ఏకైక మార్గమని అమెరికా రక్షణ కార్యాలయం పేర్కొంది. అమెరికాతో యుద్ధం తలెత్తితే ఉత్తర కొరియా జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించే వీలుందని విశ్లేషించింది. ఈ మేరకు పెంటగాన్ అమెరికా చట్ట సభ్యులకు రాసిన లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment