
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మండిపడ్డారు. తాను తీసుకొచ్చిన అణు విధానంపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని ఎన్‌బీసీ న్యూస్‌పై ధ్వజమెత్తారు. సదరు న్యూస్ నెట్‌వర్క్‌ల లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అణు సామర్థ్యాన్ని పది రెట్లు పెంచాలని కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారని ఎన్‌బీసీ కథనాన్ని ప్రసారం చేసింది. జాతీయ భద్రతా ఉన్నతాధికారులతో గత వేసవిలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యానించారని కథనంలో పేర్కొంది.
మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికన్ల భయం
న్యూయార్క్: ఉత్తర కొరియాతో తరచూ గొడవలు, ఆ దేశంతో ట్రంప్ తొందరపాటు ధోరణి వల్ల మూడో ప్రపంచ యుద్ధం రావచ్చేమోనని అమెరికన్లు భయపడుతున్నారని ఒక సర్వే తేల్చింది. అమెరికాలోని చాప్‌మేన్ వర్సిటీ నిర్వహించిన ‘సర్వే ఆఫ్ అమెరికన్ ఫియర్స్ 2017’లో అమెరికన్లు ప్రపంచ యుద్ధం గురించి ఎక్కువ భయపడుతున్నట్లు వెల్లడైంది.