
ట్రంప్ లైంగికంగా వేధించారు
- మరో ఇద్దరు మహిళల ఆరోపణ
- అంతా అబద్ధమన్న డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ! ఆయన తమను లైంగికంగా వేధించారంటూ మరో ఇద్దరు మహిళలు ఆరోపించారు. టీవీ రియాలిటీ షో ‘అప్రెంటీస్’ మాజీ అభ్యర్థి సమ్మర్ జర్వోస్, జెస్సికా లీడ్స్ ఈ ఆరోపణలు చేశారు. ట్రంప్ 2007లో తనపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని జర్వోస్ ఆరోపించగా.. 1980ల్లో విమానంలో తాము పక్కపక్కనే కూర్చుని ప్రయాణిస్తున్నపుడు ట్రంప్ తనను ముద్దుపెట్టుకున్నాడని జెస్సికా వెల్లడించారు.
ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపడేశారు. శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఆ మహిళల ఆరోపణలు అంతా అబద్ధాలని చెప్పారు. మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. వరుస ఆరోపణలతో తానో బాధితుడిగా మారుతున్నానన్నారు. మహిళలను చులకన చేసి మాట్లాడారని, వేధించారని ట్రంప్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.