'రష్యాకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు'
రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఘటనలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని టర్కీ అధ్యక్షుడు ఎర్గోసన్ తెలిపారు. గురువారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తమ గగనతల నిబంధనలు అతిక్రమించినందుకు రష్యానే క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందన్నారు. టర్కీ సైనిక బలగాలు, పైలట్లు తమ విధిని సక్రమంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇది అవసరమైనటువంటి చర్యగా తాను భావిస్తున్నట్లు ఎర్గోసన్ అన్నారు.
తాము పలుమార్లు హెచ్చరించినా రష్యా పైలట్లు స్పందించలేదన్న టర్కీ వాదనతో ఏకీభవించని రష్యా విమానం కూల్చివేతను సీరియస్గా తీసుకుంది. టర్కీకి తగిన గుణపాఠం చెబుతామని ప్రకటించి ఆ దిశగా ముందుకు కదులుతోంది. టర్కీ సరిహద్దులో గల సిరియాలోని రష్యా ఎయిర్ బేస్లో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్లను మోహరించింది.