నేపాల్లో భూప్రకంపనలు
కఠ్మాండు: భారీ భూకంపం బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్లో మరోసారి భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆదివారం రెండుసార్లు నేపాల్ భూమి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 4.3, 4.1 తీవ్రతతో రెండుసార్లు భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. మొదటి ప్రకంపనలు కఠ్మాండుకు పశ్చిమంగా ఉన్న దాదింగ్ జిల్లాలో 4.3 తీవ్రతతో వ్యాపించగా.. అదే నగరానికి తూర్పున ఉదయం 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
అయితే, భూకంప కేంద్రం ప్రకంపనలు ఏర్పడిన ప్రాంతానికి చాలా దూరంలో ఉండటం వల్ల ఎలాంటి నష్టం చోటుచేసుకోలేదు. ప్రకంపనల అనంతరం మాత్రం సంబంధిత ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరగులు తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి నేపాల్లో పది వేలమంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే.