న్యూయార్క్: కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ సర్కార్ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక నిపుణులు ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి (డబ్ల్యూఈఎస్‌పీ) నివేదిక ఆవిష్కరణ సందర్భంగా గ్లోబల్ ఎకనమిక్ మానిటరింగ్ బ్రాంచ్ చీఫ్ హమీద్ రషీద్.. భారత ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగిందని పేర్కొన్నారు. ‘‘ఇండియా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఉత్తమంగా ఉంది. ఆ దేశ జీడీపీలో ఇది 10 శాతం. ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంత భారీ ప్యాకేజీని ప్రకటించలేదు. అయితే ప్యాకేజీకి ఎలా రూపకల్పన చేశారన్న అంశాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. (భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్)
ఇక అసోసియేట్ ఎకనమిక్ అఫైర్స్ ఆఫీసర్ జూలియన్ స్లాట్‌మన్ మాట్లాడుతూ.. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ మార్కెట్లను పుంజుకునేలా చేస్తుందన్నారు. అయితే ప్రజలు కొనుగోళ్లు జరపకపోతే.. ఆశించిన ఫలితాలు వెంటనే రావని అభిప్రాయపడ్డారు. ఇక కరోనా వ్యాప్తి తొలినాళ్లలోనే లాక్‌డౌన్ విధించి భారత్ మంచి నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయడం ద్వారా భారత ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగిందన్నారు. అయితే అదే సమయంలో పేదలు, వలస కూలీలు, బలహీన వర్గాలతో పాటు ఆర్థిక వ్యవస్థపై కూడా లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. కానీ కరోనా తీవ్రమవుతున్న తరుణంలో ఒకేసారి కాకుండా క్రమక్రమంగా నిబంధనలు సడలించడం ద్వారానే మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుందన్నారు. (‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’)
Comments
Please login to add a commentAdd a comment