వాషింగ్టన్ : యుద్ధం ఎంతో ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది.. ఎన్నో కుటుంబాలను వీధిపాలు చేస్తుంది. ఇవన్ని ప్రపంచానికి కనిపించే నష్టాలు. యుద్ధం మాటున ప్రపంచానికి కనపడని హింస ఎంతటి భయంకరమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే సిరియాలో తాండవిస్తున్నాయి. యుద్ధంలో సైనికులు ఒక్కసారే చస్తారు, కానీ అక్కడి ప్రజలు ప్రతినిత్యం చస్తూ బతుకుతున్నారు. యుద్ధంలో కొందరు శరీరావయవాలను కోల్పోతారు, కానీ అక్కడ ఆత్మనే కోల్పోతున్నారు. మనకు మనమే మలినమయ్యామనే భావన ఎంత భయంకరమో అత్యాచారాలకు గురవుతున్న సిరియా మహిళలు చెప్తారు. ఎందుకంటే సిరియా అంతర్యుద్ధంలో పావులుగా మారి బలవుతున్నది వారే కాబట్టి.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తాజాగా విడుదల చేసిన నివేదిక ఒళ్లు గగుర్పొడిచే నిజాలను వెల్లడించింది. ఆ నివేదిక చూస్తే మనం మనుషుల మధ్యే ఉన్నామా అనే అనుమానం వస్తుంది. ఈ నివేదికలో హింసకే హింసను చూపించే సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచాన్ని నివ్వెరపరిచే అరాచకాలకు సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ నివేదికలో. బషర్ అసద్ నేతృత్వంలో సిరియన్ ప్రభుత్వ దళాలు చేస్తున్న అరాచకాలను బయటపెట్టింది ఈ నివేదిక. తన శత్రువులను అవమానించడానికి, బాధించడానికి వారు లైంగిక వేధింపులను, అత్యాచారాలనే మార్గంగా ఎన్నుకున్నారు. ఈ రిపోర్టులో ఉన్న కథనాలన్ని ఊహించి రాసినవి కాదు. దాదాపు 450మందితో మాట్లాడి, తెలుసుకున్న వారి భయంకరమైన అనుభవాలే ఈ కథనాలు. అన్ని భయంకరమైన లైంగిక వేధింపులకు సంబంధించినవే. ఇంటిని సోదా చేసే నెపంతో ప్రభుత్వం తమ ఒంటిని ఎలా ఆక్రమిస్తుందో తెలిపే విషాదగాథలు. ఇక్కడి వ్యవస్థ అత్యాచారం, లైంగిక అవమానాలను తప్పుగా పరిగణించట్లేదు. పైగా వాటినే ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ సాయుధ దళాలను, కుటుంబ వ్యవస్థను నిర్విర్యం చేస్తుంది. ఈ నివేదిక బాధితులు ఎంత భయంకరంగా అత్యాచారాలకు గురియ్యారో వెల్లడిస్తుంది.
తమను శత్రువులుగా భావించి ఇంటిని సోదా చేయాలనే నేపంతో అధికారులు ఎలా తమపై అత్యాచారాలు చేశారో వివరించారు బాధితులు. ఒక మహిళ వీటి గురించి చెప్తూ ‘నా ఇంటిని సోదా చేశారు. ఒక సెక్యూరిటీ అధికారి నన్ను నా గదిలోకి వెళ్లమని చెప్పి నా వెనకే వచ్చాడు. అతను నన్ను తిడుతూ, అతను చెప్పినట్లు చేయమని ఆదేశించాడు. అతడు నన్ను అపవిత్రం చేశాడు...నేను ఇక ఎన్నటికీ పవిత్రంగా మారలేను. నేను చాలా అరిచాను, కానీ ఎవ్వరూ నన్ను కాపాడ్డానికి రాలేదు’ అంటూ విలపించింది. కొన్నిసార్లు వారిని నగ్నంగా వీధుల్లోని యుద్ద ట్యాంకులకు ముందు నడిపించారు. తనను తన అన్న కళ్లముందే అత్యాచారం చేశారని ఒక స్త్రీ ఇంటర్వ్యూ చేసేవారితో చెప్పింది. తనను తన భర్త, ముగ్గురు పిల్లల ఎదుటే అత్యాచారం చేశారని మరో స్త్రీ చెప్పింది. తమ కుటుంబాల్లోని మగవారిని లొంగిపోయేలా వారిని ఒప్పించడం కోసం కొన్నిసార్లు స్త్రీలను, బాలికలను నిర్భంధ గృహాలకు తీసుకెళ్లెవారు. ప్రత్యర్థులు ఉండే ప్రాంతాల్లో, గవర్నమెంట్ చెక్‌పాయింట్లలో ఉండే అధికారులు కూడా మహిళలను, పిల్లలను ఇలానే వేధించేవారు. వీరందరిరిని గుంపులుగా తరలించే సమాయాల్లో కొందరిని వేరు చేసి వారిపై అత్యాచారాలు జరిపేవారు. కేవలం మహిళలు, పిల్లలే కాదు మధ్యవయస్సు స్త్రీలను కూడా వారు వదల్లేదు. వారిని కూడా ‘సునిశితంగా వెతికేవారు’.
‘ఒక మిలిటరీ అధికారి నన్ను బెస్మెంట్‌లోకి తీసుకెళ్లి కొట్టాడు, అతడు నా ఛాతీ, జననాంగాలను తాకాడు’ అంటూ ఒక మధ్యవయస్కురాలు తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. మరో స్త్రీ తనకు ఎదురైన మాటలతో చెప్పడానికి వీలుకాని అత్యంత హేయమైన చేదు అనుభవాన్నివివరించింది. నిండా 9ఏళ్లు లేని బాలికల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. గర్భిణీ స్త్రీలనే కనికరం కూడా చూపలేదు. వారిపై కూడా అత్యాచారాలను కొనసాగించారు. ఎన్నో ప్రాణాలు తల్లి కడుపులోను తుదిశ్వాస విడిచాయి. మహిళందరినీ నగ్నంగా చేసి జనాల ముందు నిలబెట్టెవారు. అంతటితో ఆగక మగ అధికారులు వారి జననాంగాలను తాకుతు హేయంగా ప్రవర్తించేవారు. నిర్బంధ గృహాల్లోని మహిళలపై అత్యాచారాలతో పాటు, వారి సున్నిత శరీరావయవాలను కరెంటు షాక్‌కు గురిచేసేవారు. కొందరు సామూహిక అత్యాచారాలకు గురయ్యారు.
ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే. వారి చేతుల్లో మలినమవ్వకుండా ఉండేందుకు ఒక స్త్రీ తానే తన శరీరాన్ని రక్తం, మూత్రము, పురుగులతో కప్పుకుంది. వేలాది మంది మహిళలను, పిల్లలను నిర్బంధించారు. వారిలో లాయర్లు, జర్నలిస్టులు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తల బంధువులు ఉన్నారు. వారిని కూడా ప్రత్యర్థులుగా, సాయుధ దళాలకు చెందిన వారిగా అనుమానిస్తూ నిర్బంధించేవారు. కేవలం స్త్రీలే కాదు నిర్బంధ గృహాల్లోని పురుషులపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అధికారులు వారి వినోదం కోసం బంధించిన మగవారి శరీరంలోని సున్నిత ప్రదేశాల్లోకి పైపులను, రాడ్లను తోస్తున్నారు. వారి మగ బంధువులతో కలవమంటున్నారు. ఈ మధ్య ప్రభుత్వ దళాలు వాయుదాడులకు మారడంతో 2015 నుంచి ఈ సంఘటనలు కాస్తా తగ్గాయి. ఇవన్ని ఒక్కచోట జరిగిన సంఘటనలు కావు. దారా, హామ్స్, డమాస్కస్, లటాకియా దాదాపు ఇలా దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు.
జరిగిన నేరాలన్నీ బాధితుల మీద ఎలాంటి ప్రభావం చూపాయి అన్నది ఈ నివేదికలోని మరో ముఖ్యమైన అంశం. జరిగిన సంఘటనలు వారి మనసులో తప్పుచేశామనే భావాన్ని నింపాయి. వారంతా జీవితం పట్ల నిరాశాతో ఉన్నారు. మహిళలు, పిల్లలు తమను తాము తమ కుటుంబాలకు అగౌరవంగా భావిస్తున్నారు. ఒక స్త్రీ అత్యాచారానికి గురికావడం కంటే చనిపోవడం మేలని భావించే వాతావరణంలో ఇలాంటి అకృత్యాలు జరుగుతుండటంతో.. కొన్ని సందర్భాల్లో బాధితుల కుటుంబసభ్యులే వారిని అవమానిస్తున్నారు. వారినే నిందితులుగా చూస్తున్నారు. కొంతమంది పురుషులను నపుంసకులుగా మార్చారు. దీనివల్ల వారు అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించి మిగితా వారితో కలవలేకపోతున్నారు. అత్యాచారానికి గురైన చాలామంది స్త్రీలు, బాలికలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. లైంగిక వేధింపులకు భయపడి చాలా కుటుంబాలు వేరే ప్రదేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. సిరియా ప్రభుత్వం వీటన్నింటి గురించి తెలిసి కూడా తెలియనట్లు నటిస్తుంది. ఈ అకృత్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు అనేదే ఇప్పుడు ప్రపంచదేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న!
Comments
Please login to add a commentAdd a comment