'హవ్వా.. అణుదాడులేంటి.. పాక్ ఉగ్ర దేశమే'
న్యూఢిల్లీ: భారత్ నేరుగా పాకిస్థాన్ను ఉగ్రవాద దేశం అని ప్రస్తావించడంతో మరో దేశం పాక్ ను ఉగ్రవాద దేశమంటూ ప్రత్యక్షంగా సంబోధించింది. భారత్ తో తన గొంతు కలిపింది. ఐక్యరాజ్య సమితి పాకిస్థాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిందేనంటూ బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ మువాజెమ్ అలీ డిమాండ్ చేశారు. భారతదేశంలో బంగ్లాదేశ్ తరుపున హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న ఆయన నేరుగా ఈ ప్రకటన చేశారు. 'తొలిసారి సార్క్ సభ్యత్వ దేశాల్లో సగం దేశాలు ఇస్లామాబాద్ లో నిర్వహించే దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) శిఖరాగ్ర సదస్సును బహిష్కరించాలని నిర్ణయించాయి. ఇదే బలమైన సందేశం' అని ఆయన అన్నారు.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ భవిష్యత్తులో విదేశాంగ విధానం ఎలా కొనసాగిస్తుందో చూడాలని చెప్పారు. బంగ్లాదేశ్ లోని ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసే చర్యలను ఇప్పటికైనా పాక్ ఆపేయాలని మండిపడ్డారు. అణుదాడులు చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఎం అసిఫ్ నేరుగా బెదిరిస్తున్న ప్రాంతంలో ఎలా సమావేశం నిర్వహిస్తారోనని తనకు ఆయన ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. సార్క్ సమావేశానికి ఏ విధమైన వాతావరణం ఉందో ఆ మంత్రి సందేశం తెలియజేస్తుంది. యుద్ధం, అణుదాడులు వంటివి మాట్లాడకూడదు' అని అలీ వివరించారు.