సెలక్ట్ అయ్యారంటూ మెయిల్.. అంతలోనే
బఫేలో, న్యూయార్క్:
ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 5000 మంది విద్యార్థులకు సెలక్ట్ అయినట్టుగా యూనివర్సిటీ నుంచి మెయిల్లు అందాయి. అయితే కొద్ది సేపట్లోనే.. తూచ్ అంటూ మరో మెయిల్.. విషయమేంటంటే ముందు వచ్చిన మెయిల్ తప్పంటూ దాని సారంశం. దీంతో సెలక్ట్ అయ్యామన్న ఆనందం విద్యార్థుల్లో కొద్ది సేపైనా లేకుండా పోయింది. ఇంత పెద్ద తప్పిదం చేసింది ప్రపంచంలోనే మేటి యూనివర్సిటీలలో ఒకటైన ది స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్(యూనివర్సిటీ అట్ బఫేలో ).
తమ యూనివర్సిటీలో అడ్మిషన్లకోసం దరఖాస్తు చేసుకున్న 5000 మంది విద్యార్థులకు యాక్సెప్టెన్సీ మెయిల్స్ పంపింది. అయితే పొరపాటున దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించక ముందే సెలక్ట్ అయినట్టుగా మెయిల్స్ పంపామని యూనివర్సిటీ అధికార ప్రతినిధి జాన్ డెల్లా తెలిపారు. తప్పిదాన్ని గుర్తించి మూడు, నాలుగు గంటల వ్యవధిలోనే విద్యార్థులను క్షమాపణ కోరుతూ మరో మెయిల్ పంపామని జాన్ పేర్కొన్నారు. అప్లికేషన్ డేటాబెస్ నుంచి తప్పుగా ఈమెయిల్స్ లిస్ట్ జనరేట్ అవ్వడం వల్లే ఈ తప్పిదం జరిగిందని యూనివర్సిటీ అట్ బఫేలో అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది.
మరో ముఖ్యమైన విషయమేంటంటే తప్పుగా ఈ మెయిల్స్ వచ్చిన వారిలోనూ.. తమ యూనివర్సిటీలో దరఖాస్తుల పరిశీలన తర్వాత ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ యూనిర్సిటీలో 30,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.