గుజ్రాన్ వాలా పట్టణంలో వెలసిన పోస్టర్లు (సౌజన్యం: ఇండియన్ ఎక్స్ ప్రెస్)
జమ్మూకశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై దాడి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే-ఈ-తొయిబా పనేనని వెల్లడైంది. పాకిస్థాన్ లోని గుజ్రాన్ వాలా పట్టణంలో వెలసిన పోస్టర్లు ఇందుకు సాక్షంగా నిలుస్తున్నాయి. ఉడీ దాడిలో హతమైన ఉగ్రవాది మహ్మద్ అనాస్ అలియాస్ అబూ సిరాఖా అంత్యక్రియలు సందర్భంగా నిర్వహించే ప్రత్యేక నమాజ్ కు రావాలంటూ స్థానికులను ఆహ్వానిస్తూ గుజ్రాన్ వాలాలో పోస్టర్లు వెలిశాయని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది.
'ఎంతో ధైరవంతుడైన మత పోరాటయోధుడు అబూ సిరఖా మహ్మద్ అనాస్.. ఆక్రమిత కశ్మీర్ లో ఉడీ బ్రిగేడ్ క్యాంపులో 177 మంది హిందూ సైనికులను నరకానికి పంపాడు. మతం కోసం అతడు ప్రాణత్యాగం చేశాడ'ని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. మహ్మద్ అనాస్ ఫొటోతో పాటు లష్కరే-ఈ-తొయిబా అధినేత హఫీజ్ మహ్మద్ సయీద్ చిత్రాన్ని పోస్టర్లతో ముద్రించారు. అనాస్ మృతదేహం లేకుండా అతడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. గుజ్రాన్ వాలా పట్టణంలోని గిర్ జాఖ్ సమీపంలో బాదానుల్లా ప్రాంతంలో అంత్యక్రియలు జరపనున్నట్టు తెలిపారు.
ఉడీ దాడి పాకిస్థాన్ ఉగ్రవాదుల పనేనని భారత్ చేస్తున్న వాదనకు ఈ పోస్టర్లు సాక్ష్యంగా నిలిచాయి. ఉడీ దాడితో సంబంధం లేదని బొంకుతున్న పాకిస్థాన్ దీనికి ఏం సమాధానం చెబుతుందో చూడాలి. అయితే పాకిస్థాన్ కే చెందిన జైషే-ఈ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉడీ దాడికి పాల్పడిందన్న అనుమానాన్ని ప్రాథమికంగా భారత్ వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పోస్టర్లతో ఇది లష్కరే-ఈ-తొయిబా ఘాతుకంగా వెల్లడైంది. కుట్రదారులను గుర్తించడం, ఆధారాల సేకరణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి సాధించలేకపోయారు. ఉడీ దాడిలో హతమైన ఉగ్రవాదుల వద్ద రెండు జర్మనీ తుపాకులు దొరికాయి. అయితే వీటిలో ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. మరో తుపాకీని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన మందులు, ఆహార పొట్లాలు ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారని నిర్ధారించినా.. వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో కచ్చితంగా నిర్దరణకు వచ్చే అవకాశం కల్పించలేకపోయాయి. ఉగ్రవాదులకు చొరబాటుకు సహకరించారనే ఆరోపణలతో అరెస్టు చేసిన అహసాన్ ఖుర్షీద్, ఫైసాల్ అవాన్ కూడా పరస్పర విరుద్ధ వాంగూల్మం ఇవ్వడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఈ నేపథ్యంలో గుజ్రాన్ వాలాలో వెలుగుచూసిన పోస్టర్లు సాక్ష్యంగా నిలబడతాయా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఉడీ దాడిలో హతమైన మిగతా ముగ్గురు ఉగ్రవాదుల స్వస్థలాల్లో కూడా ఇదేవిధంగా పోస్టర్లు వెలిశాయో, లేదో తెలియదని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' పేర్కొంది. సెప్టెంబర్ 18న ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 సైనికులు మృతి చెందారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.