ఫోటో కర్టెసీ: గెట్టీ
వాషింగ్టన్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు అమెరికాలోని శతకోటీశ్వరులు న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడి తమ విలాసవంతమైన బంకర్ల (నేల మాళిగలు)లో తలదాచుకుంటున్నారు. వారిలో సిలికాన్ వ్యాలీకి చెందిన శతకోటీశ్వరులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక రోజు ప్రపంచ ప్రళయం (డూమ్స్ డే) వచ్చి అందరూ చనిపోతారని నమ్మే కొంత మంది శతకోటీశ్వరులు న్యూజిలాండ్‌లో అత్యంత ఖరీదు చేసే విలాసవంతమైన బంకర్లను ఎన్నడో కొని పెట్టుకున్నారని ‘డెయిలీ మెయిల్’ వెల్లడించింది.
వారిలో ‘పేపాల్’ వ్యవస్థాపకుడు, ఫేస్‌బుక్ శతకోటీశ్వరుడు పీటర్ తియాల్, టెక్సాస్‌లోని బ్లూబెర్గ్ కంపెనీ జనరల్ మేనేజర్ గేరీ లించ్ కూడా ఉన్నారు. పీటర్ తియాల్ న్యూజిలాండ్‌లోని అందమైన క్వీన్స్‌టౌన్‌లో మల్టీపర్సన్ భవనాన్ని కొనుగోలు చేశారు. అంటే భూమిపైన మామూలుగా కనిపించే ఆ భవనంలోనే అవసరమైనప్పుడు తలదాచుకునేందుకు ‘ప్యానిక్ రూమ్’ ఒకటి ఉంది. దాన్ని ఆయన 4.7 మిలియన్ డాలర్లు (దాదాపు 35.15 కోట్ల రూపాయలు) పెట్టి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఇప్పుడాయన అక్కడికి వెళ్లారో, లేదో తెలియడం లేదు. అయితే గేరీ లించ్ లాంటి శతకోటీశ్వరులు ప్రాణాంతకమైన కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందంటూ వార్తలు వెలువడిన తొలుతలోనే అమెరికా నుంచి విమానాలు పట్టుకొని న్యూజిలాండ్ వెళ్లారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త మిహాయి దినులెస్కూ తన భార్యతో కలిసి మార్చి 12వ తేదీన న్యూజిలాండ్ వెళ్లారు.
రైజింగ్ ఎస్ కంపెనీ న్యూజిలాండ్‌లో ఇలాంటి బంకర్లను కొన్నింటిని ఇప్పటికే నిర్మించగా మరికొన్నింటిని నిర్మిస్తోంది. వాటిని మూడు మిలియన్ డాలర్ల నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల వరకు విక్రయిస్తోంది. వాటిలో 22 మంది నిద్రించే అవకాశం ఉన్న మూడు మాస్టర్ బెడ్ రూమ్‌లు, లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్‌తోపాటు ఓ ఫిట్‌నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ ఉన్న బంకర్లు కూడా ఉన్నాయి. కొన్ని బంకర్లు కూడా భూమిలోపల రెండు, మూడు అంతస్తులుగా ఉన్నాయి. వాటన్నింటికి కావాల్సిన ఆక్సిజన్, విద్యుత్ నిరంతరాయంగా సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి. వాటిల్లో కొందరు శతకోటీశ్వరులు ఏడాది పాటు కొదవ లేకుండా తినుపదార్థాలను నిలువ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment