వాషింగ్టన్: మహమ్మారి కరోనా(కోవిడ్-19) సంక్షోభంతో అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు, కరోనా నివారణ చర్యలకు అగ్రరాజ్యం అమెరికా భారీ ప్యాకేజీ ప్రకటించింది. కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా 484 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తూ రూపొందించిన బిల్లును హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గురువారం ఆమోదించింది. కరోనా కల్లోలం కారణంగా ఆర్థికంగా నష్టాలు చవిచూసిన చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలని పేర్కొంది. డెమొక్రటిక్ పార్టీ సభ్యుల సారథ్యంలోని ప్రతినిధుల సభ నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. గురువారం సాయంత్రం ఈ బిల్లుపై సంతకం చేసి చట్టంగా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. (రెండు నెలల పాటు నో ఎంట్రీ)
కాగా కోవిడ్-19 దాటికి అమెరికాలో దాదాపు 50 వేల మంది మృత్యువాత పడ్డారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమవుతోంది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన ట్రంప్ సర్కారు.. మహమ్మారి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను సురక్షిత పద్ధతిలో దశల వారీగా తిరిగి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. గురువారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ 23 రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. త్వరలోనే కోవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొనబోతున్నాం’’అని పేర్కొన్నారు.(సూర్యరశ్మితో కరోనాకు చెక్)
అదే విధంగా.. ‘‘సురక్షిత మార్గాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాం. ఇందుకు ప్రతీ అమెరికా పౌరుడు సహకరించాలి. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలి. విధిగా మాస్కులు ధరించాలి. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన దేశాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురాగలం. హ్యోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంలోని శాస్త్రవేత్తలు వైరస్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. శీతల, పొడి వాతావరణంలో వైరస్ ప్రభావం చూపగలదని వారి పరిశోధనల్లో తేలింది. అయితే పొడి ప్రదేశాల్లో దాని తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారిని తరిమికొట్టవచ్చు’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment