
వాషింగ్టన్ : అమెరికాలో పౌర హక్కులకై జరిగిన శాంతియుత పోరాటాన్ని మహాత్మా గాంధీ ఎంతగానో ప్రభావితం చేశారని హౌజ్ ఆఫ్ రిప్రంజేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యంలో పౌర హక్కులకై పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు గాంధీజీ స్ఫూర్తిని ఇచ్చారని.. ఆయనొక ఆధ్యాత్మిక నాయకుడని పేర్కొన్నాడు. అమెరికా- ఇండియా వ్యూహాత్మక- భాగస్వామ్య ఫోరమ్ నాయకత్వ రెండో సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్యంలో తనకు గాంధీజీ గురించి తెలియదని.. అయితే ఆయన గురించి తెలుసుకున్న తర్వాత గాంధీ రాసిన ఒక్క పుస్తకాన్ని కూడా వదిలిపెట్టకుండా చదివినట్లు తెలిపారు.
‘క్యాథలిక్ స్కూల్‌లో చదివేదాన్ని. అప్పుడు హాట్ పెట్టుకుని వెళ్లేదాన్ని. ఓ రోజు నన్.. నువ్వేమైనా మహాత్మా గాంధీ అనుకుంటున్నావా అని అడిగారు. నిజానికి అప్పుడు ఆయన గురించి నాకు అస్సలు తెలియదు. నన్ మాటలతో గాంధీజి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. చిన్ననాటి నుంచే ఆయన పుస్తకాలను చదవడం మొదలుపెట్టాను. ఇక కాలేజీ రోజుల్లో లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ నేనే తీసుకువచ్చేదాన్ని. ఈ క్రమంలో ఓ రోజు చీర కట్టుకుని ఉన్న నా క్లాస్‌మేట్ నా దగ్గరికి వచ్చింది. నువ్వు గాంధీ పుస్తకాలన్నీ తీసుకువెళ్లావు కదా. మా నాన్న అమెరికాలో పాకిస్తాన్ రాయబారి. నువ్వు జిన్నా రాసిన పుస్తకాలు కూడా చదవాల్సిందే’ అని పట్టుబట్టింది అని నాన్సీ తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
అందులో మోదీ మాస్టర్!
తన ప్రసంగంలో భాగంగా నాన్సీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘ మనకు విజన్ ఉంది.. సంపూర్ణ ఙ్ఞానం ఉంది... వ్యూహాత్మకంగా వ్యవహరించే గుణం ఉంది... నిజానికి మోదీ వీటన్నింటిలో మాస్టర్’ అని నాన్సీ పేర్కొన్నారు. అదే విధంగా అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం ఎంతో అద్భుతంగా కొనసాగిందని.. అంతకు ముందెన్నడూ ఇలాంటి స్పీచ్ విననేలేదని ప్రశంసలు కురిపించారు. ‘ సిలికాన్ వ్యాలీలో ప్రసంగించినపుడు ఎంతో ఉద్వేగంగా ఉన్న మోదీకి.. న్యూఢిల్లీలో సభికులను ప్రశాంత వాతావరణంలో ఆలోచింపజేసేలా ఉన్న మోదీకి ఎంతో తేడా ఉంది. ఆయనలో ఉన్న ఈ రెండు కోణాలు చూస్తే ఇద్దరూ వేర్వేరు మనుషులేమో’ అనిపిస్తుంది అని నాన్సీ పలు సంఘటనలను ఉదాహరించారు.
Comments
Please login to add a commentAdd a comment