అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మైక్ పాంపియో (ఫైల్‌ఫోటో)
న్యూయార్క్ : ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకుని, వారికి నిధుల ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి ఇచ్చిన వాగ్ధానాలను పాకిస్తాన్ నిలుపుకోవాలని అమెరికా కోరింది. పుల్వామా ఉగ్రదాడిలో జైషే ఉగ్రవాదుల ప్రమేయంపై పాకిస్తాన్‌కు భారత్ బుధవారం ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అమెరికా పాక్‌పై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.
సీమాంతర ఉగ్రవాదంతో పాటు ఇటీవలి పుల్వామా దాడి వంటి ఘటనలు దక్షిణాసియాలో శాంతి సుస్ధిరతకు విఘాతం కలిగిస్తాయని, ఐరాస భద్రతామండలికి హామీ ఇచ్చిన మేరకు ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టే విషయంలో పాకిస్తాన్ తన నిబద్ధతకు కట్టుబడి ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మైక్ పాంపియో పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్‌లు ఉద్రిక్తతలు మరింత పెరిగే చర్యలను పక్కనపెట్టి చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూచించారు. సైనిక చర్యలతో పరిస్ధితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment