వాషింగ్టన్: ఎఫ్–16 యుద్ధ విమానం దుర్వినియోగానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వాల్సిందిగా పాకిస్తాన్‌ను అమెరికా కోరింది. ఎఫ్–16 విమానాలను తీవ్రవాద వ్యతిరేక పోరాటానికే ఉపయోగించాలని, ఇతర దేశాలపై దాడికి వాడరాదని అమెరికా షరతు విధించింది. దీన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ ఎఫ్–16 విమానాన్ని భారత్‌పై దాడికి ఉపయోగించినట్టు అమెరికాకు తెలిసిందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.
ఎఫ్–16ను వాడలేదు..
భారత్‌పై దాడికి తాము ఎఫ్–16 విమానాలను ఉపయోగించలేదని పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. భారత్ తమ ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసిందనడాన్ని కూడా ఖండించింది. అయితే, పాక్ ఆ విమానాలను వాడినట్టు భారత త్రివిధ దళాధిపతులు గురువారం నాటి సమావేశంలో ఆధారాలు సహా నిరూపించారు. పాకిస్తాన్ ఉపయోగించిన ఏఐఎం–120 క్షిపణి శకలాలను ఈ సమావేశంలో చూపించారు. ఈ క్షిపణులను ఎఫ్–16 విమానాల ద్వారా మాత్రమే ప్రయోగించగలరని, పాక్ వద్ద ఉన్న మరే విమానం దీన్ని ప్రయోగించలేదని భారత వైమానిక దళాధికారులు చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ విషయాలను ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇవ్వాలని పాక్‌ను కోరామన్నారు.
వివరాలు వెల్లడించలేం..
విదేశాలకు సంబంధించిన మిలటరీ కాంట్రాక్టుల్లోని ఒప్పందాలను బయటకు వెల్లడించరాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. అందువల్ల ఎఫ్–16ల విషయంలో పాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలు వెల్లడించలేమన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పెద్ద ఎత్తున ఆయుధాలు విక్రయించే అమెరికా వాటి వినియోగానికి సంబంధించి కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందాలను ఉల్లంఘించడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తుంది. పాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటో అమెరికా చెప్పనప్పటికీ, దాదాపు 12 నిబంధనలు విధించినట్టు తెలుస్తోంది. ఎఫ్–16 విమానాలను పాకిస్తాన్ బయట ఉపయోగించాలన్నా.. సైనిక విన్యాసాల్లో వినియోగించాలన్నా, మూడో దేశంపై ప్రయోగించాలన్నా ముందుగా అమెరికా ప్రభుత్వం అనుమతి పొందాలని గతంలో ఆ దేశ హోం శాఖలో పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
తొలుత అభ్యంతరం.. షరతులతో విక్రయం..
ఒబామా సర్కార్ 2016లో పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్–16 విమానాలు విక్రయించాలని నిర్ణయించింది. అయితే, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వీటిని భారత్‌పైకి ప్రయోగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభ్యుల ఒత్తిడితో ఒబామా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. అప్పట్లో భారత ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తర్వాత కొన్ని షరతులతో అమెరికా పాకిస్తాన్‌కు వీటిని విక్రయించింది.
ఎఫ్16 వాడకంపై అమెరికా గుర్రు
Published Sun, Mar 3 2019 4:33 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment