
అమెరికాపై 9/11లాంటి భారీ ఉగ్రదాడి జరుగనుందా?
అమెరికాలో భారీ ఎత్తున ఉగ్రదాడి జరుగనుందా..! అది కూడా సెప్టెంబర్ 11 నాటి దాడులంతటి భయంకరంగా ఉంటుందా..! అంటే దాడుల విషయమేమోగానీ అక్కడి పౌరులను మాత్రం ప్రస్తుతం ఈ భయం వెంటాడుతోందట.
వాషింగ్టన్: అమెరికాలో భారీ ఎత్తున ఉగ్రదాడి జరుగనుందా..! అది కూడా సెప్టెంబర్ 11 నాటి దాడులంతటి భయంకరంగా ఉంటుందా..! అంటే దాడుల విషయమేమోగానీ అక్కడి పౌరులను మాత్రం ప్రస్తుతం ఈ భయం వెంటాడుతోందట. ఈ విషయాన్ని ఓ పోల్ సర్వే వెల్లడించింది. 2001, సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు అనూహ్య దాడులు నిర్వహించిన తర్వాత దాదాపు ఉగ్రవాదంపై అమెరికా యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పదిహేనేళ్ల కాలంలో ఎప్పుడూ తమపై ఉగ్రవాద దాడులు జరుగుతాయని భావించని అమెరికా పౌరులు ప్రస్తుతం అలాంటి ఆందోళననే కనబరుస్తున్నారట.
మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన పోల్ సర్వేలో రాబోయే కొద్ది నెలల్లో తమ దేశంలో భారీగా ఉగ్రదాడులు జరగవచ్చని 56శాతం అమెరికా పౌరులు భయపడుతున్నారని పోల్ తెలిపింది. ప్రస్తుతం అమెరికా చాలా సురక్షితంగా ఉందని సగానికి పైగా డెమొక్రటిక్ పార్టీ వాళ్లు చెబుతుండగా రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వారు మాత్రం అందుకు భిన్నంగా స్పందించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. గత నెలలో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ పోల్ నిర్వహించగా తాజాగా ఈ విషయాలు బయటకొచ్చాయి.