ఒబామా, హిల్లరీపై నిప్పులు చెరిగిన ట్రంప్!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నిప్పులు చెరిగారు. ఆర్లెండో నైట్ క్లబ్ లో జరిగిన నరమేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించలేదని ఒబామాను విమర్శించిన ట్రంప్.. 'రాడికల్ ఇస్లాం' అనే పదం వాడటంలో చాలా వ్యత్యాసమే ఉందని పేర్కొన్నారు. టెర్రరిస్టులపై యుద్ధాన్ని ప్రకటించడంలో భాగంగా ఇలాంటి పదాలను వాడటం సరైన చర్యగా చెప్పుకొచ్చారు. అసలు సమస్య ఏంటన్నదే ఒబామాకు తెలియదని, ఏ రకమైన ఉగ్రవాదం ఉంది ?, దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్న విషయాలపై చర్చించనంత వరకూ ప్రస్తుత అధ్యక్షుడికి దానిపై అవగాహనా రాదంటూ మండిపడ్డారు. సమస్యలే తెలియనప్పుడు వాటిపై తగిన చర్యలు తీసుకునే స్థాయిలో ఒబామా లేరని విమర్శించారు.
అట్లాంటాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. రాజకీయంగా కరెక్ట్ అని చెప్పుకోవాలనుకుంటున్న ఒబామా, ఉగ్రవాదంపై తగిన చర్యలు తీసుకోవడం విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి అయినా 'రాడికల్ ఇస్లాం' అనే పదం ఎందుకు వాడకూడదో తెలుసా లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత నాయకులు బలహీనులు కావడం, ఉగ్రవాదంపై నియంత్రణ చర్యలు తీసుకోలేని కారణంగానే ఒర్లాండో దాడి జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని తాను ముందే చెప్పినా అధ్యక్షుడు ఒబామా పట్టించుకోలేదని వివరించారు. ఒబామా చెప్పిన విషయాలను హిల్లరీ గుడ్డిగా ఫాలో అవుతున్నారని, ఆమెకంటూ సరైన విధానాలు లేవని డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేశారు.