Orlando shooting
-
ఒబామా, హిల్లరీపై నిప్పులు చెరిగిన ట్రంప్!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నిప్పులు చెరిగారు. ఆర్లెండో నైట్ క్లబ్ లో జరిగిన నరమేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించలేదని ఒబామాను విమర్శించిన ట్రంప్.. 'రాడికల్ ఇస్లాం' అనే పదం వాడటంలో చాలా వ్యత్యాసమే ఉందని పేర్కొన్నారు. టెర్రరిస్టులపై యుద్ధాన్ని ప్రకటించడంలో భాగంగా ఇలాంటి పదాలను వాడటం సరైన చర్యగా చెప్పుకొచ్చారు. అసలు సమస్య ఏంటన్నదే ఒబామాకు తెలియదని, ఏ రకమైన ఉగ్రవాదం ఉంది ?, దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్న విషయాలపై చర్చించనంత వరకూ ప్రస్తుత అధ్యక్షుడికి దానిపై అవగాహనా రాదంటూ మండిపడ్డారు. సమస్యలే తెలియనప్పుడు వాటిపై తగిన చర్యలు తీసుకునే స్థాయిలో ఒబామా లేరని విమర్శించారు. అట్లాంటాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. రాజకీయంగా కరెక్ట్ అని చెప్పుకోవాలనుకుంటున్న ఒబామా, ఉగ్రవాదంపై తగిన చర్యలు తీసుకోవడం విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి అయినా 'రాడికల్ ఇస్లాం' అనే పదం ఎందుకు వాడకూడదో తెలుసా లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత నాయకులు బలహీనులు కావడం, ఉగ్రవాదంపై నియంత్రణ చర్యలు తీసుకోలేని కారణంగానే ఒర్లాండో దాడి జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని తాను ముందే చెప్పినా అధ్యక్షుడు ఒబామా పట్టించుకోలేదని వివరించారు. ఒబామా చెప్పిన విషయాలను హిల్లరీ గుడ్డిగా ఫాలో అవుతున్నారని, ఆమెకంటూ సరైన విధానాలు లేవని డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేశారు. -
గే ముద్దులే ఘన నివాళి..
ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలోని పల్స్ గే నైట్ క్లబ్ లో ఆదివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 49 మందిని పోలీసులు గుర్తించారు. పరిమిత వైశాల్యంలోని ఓ గదిలో పార్టీ చేసుకుంటున్న 300 మందిపై దుండగుడు మతిన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబ్డ సంగతి తెలిసిందే. దుండగుణ్ని మట్టుపెట్టిన అనంతరం లోపలికి వెళ్లిన పోలీసులు అక్కడి దృశ్యాలు చూసి గగుర్పాటుకు గురయ్యారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్లో కొందరి ముఖాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. మృతదేహాలను ఆసుపత్రికి చేర్చిన పోలీసులు వాటిని గుర్తించే ప్రక్రియను సోమవారానికి పూర్తిచేశారు. చనిపోయిన వారిలో విద్యార్థులు, నర్సులు, డ్యాన్సర్లు, పెళ్లయినవాళ్లు తదితరులున్నట్లు ఆర్లెండో పోలీసులు తెలిపారు. కాగా, చనిపోయిన 49 మంది గే నైట్ క్లబ్ సభ్యులకు.. మగ- మగ ముద్దుల ఫొటోల ద్వారా నెటిజన్లు ఘన నివాళులు అర్పించారు. 'మగ- మగ ముద్దులు పెట్టుకోవడం చూడలేకే నా కొడుకు ఈ పని చేసి ఉంటాడు' ఆర్లెండో నరమేధం అనంతరం దుండగుడు ఒమర్ మతిన్ తండ్రి చేసిన వ్యాఖ్య. సమాజంలోని పలు వర్గాలు ఆయన వ్యాఖ్యలను ఖండించగా, ఎల్జీబీటీలు మాత్రం తీవ్ర స్థాయిలో స్పందించారు. 'నైట్ క్లబ్ లో ప్రాణాలు కోల్పోయిన 49 మంది సహోదరులకు ఇదే మా ఘన నివాళి' అంటూ సోషల్ మీడియాలో మగ- మగ ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలను పెద్ద ఎత్తున పోస్ట్ చేశారు. సోమవారం ట్విట్టర్ లో #TwoMenKissing విపరీతంగా ట్రేడ్ అయింది. ఒకేసారి దాదాపు 1000 మంది #TwoMenKissing లో చర్చించుకుని ఫేస్ బుక్ చర్చల రికార్డును బద్దలు కొట్టారు. తమ గే పార్ట్ నర్ ను ముద్దు పెట్టుకుంటూ ఫొటోలు పెట్టినవారిలో ప్రముఖుల దగ్గర్నుంచి సామాన్యుల వరకు ఉన్నారు. Two men kissing. ❤️ pic.twitter.com/XSzQry1x4Q — Shadi Petosky (@shadipetosky) June 12, 2016 -
అమెరికా విషాదం!
ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా తుపాకి సంస్కృతిని వదులుకోవడానికి సిద్ధపడని అమెరికాలో ఒమర్ మతీన్ అనే ఉన్మాది స్వలింగ సంపర్కుల క్లబ్లో రెచ్చిపోయి కాల్పులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరో 53మందిని గాయపరిచాడు. ఆ వెంటనే క్లబ్‌పై దాడి చేసిన పోలీసులు మతీన్‌ను కాల్చి చంపారు. ఇంతమందిని ఒక దుండగుడు హతమార్చడం అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ దుర్మార్గానికి ఒడిగట్టే ముందు తన ఫేస్బుక్ పేజీలో పెట్టిన సందేశా లనుబట్టి మతీన్ అఫ్ఘాన్ తాలిబన్ల మద్దతుదారుడని పోలీసులు ప్రాథ మిక నిర్ధారణకొచ్చినా ఉగ్రవాద సంస్థలతో అతని సంబంధాలెలాంటివో ఇంకా తేల వలసే ఉన్నది. ఈ ఉదంతంలో మత ప్రమేయం లేదని, అతనికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని మతీన్ తండ్రి చెబుతున్నాడు. కేవలం స్వలింగ సంపర్కులంటే ఉండే అసహ్యంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చునని అంటున్నాడు. కాల్పులు జరుపుతున్న సమయంలోనే మతీన్ పోలీస్ విభాగానికి ఫోన్‌చేసి తాను ఉగ్రవాద ఐఎస్ సంస్థకు చెందినవాడినని ప్రకటించుకున్నట్టు కొన్ని మీడియా కథ నాలు చెబుతున్నాయి. ఉగ్రవాద సంస్థ ఐఎస్ మాత్రం మతీన్ తమ మిలిటెంటే నని ప్రకటించింది. అమెరికాలో ఇలాంటి కాల్పుల ఉదంతం చోటు చేసుకున్నప్పు డల్లా అది తమ ఘనకార్యమేనని చెప్పుకోవడం ఐఎస్‌కు మామూలే! ఇందులోని నిజా నిజాలు నిర్ధారణ కావలసి ఉంది. ఎంతో భద్రంగా, క్షేమంగా ఉన్నట్టు కనబడే అమెరికా సమాజంలో ఈ మాదిరి ఘటనలు లోగడ కూడా జరిగాయి. నాలుగేళ్లక్రితం ఒక ప్రాథమిక పాఠశాలపై దాడి చేసిన యువకుడు 18మంది చిన్నారులు, ప్రిన్సిపాల్, సైకాలజిస్టుతో సహా 28 మందిని కాల్చిచంపాడు. నిరుడు శాన్ బెర్నార్డినోలో ఉగ్రవాద జంట కాల్పులకు దిగి 14మందిని హతమార్చారు. గత మూడేళ్లలో 200 మందికి పైగా ఇలాంటి ఉదంతాల్లో మరణించారు. మరో 200మంది గాయపడ్డారు. ఈమధ్య కాలంలో ఈ మాదిరి ఉదంతాలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఏడాదికి సగటున 6.4 ఉదంతాలు జరగ్గా, ఇప్పుడు అవి 16.4కు చేరుకున్నాయని ఆ లెక్కలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా ఒక సంస్థకో, బృందానికో చెందినవారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే కాస్త ముందో, వెనకో వాటి కూపీ లాగడం, నియం త్రించడం పోలీసులకు సాధ్యమవుతుంది. కానీ ఎవరి ప్రమేయమూ లేకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కడే దాడులకు పాల్పడితే అలాంటివారిని ముంద స్తుగా గుర్తించడం, నియంత్రించడం ఎంత నిఘా ఉన్నా అసాధ్యమవుతుంది. అయితే ఇంతవరకూ ఆ దేశంలో సాగుతున్న ఘటనలకూ, ప్రస్తుతం జరిగిన ఘట నకూ మౌలికంగా తేడా ఉంది. నిందితుడు అఫ్ఘాన్ సంతతికి చెందిన యువకుడు. ఇస్లాం మత విశ్వాసాలున్నవాడు. పైగా మూడేళ్ల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరో సారి ‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై ఎఫ్‌బీఐ మతీన్‌ను విచారిం చింది. మతీన్ ఉగ్రవాద ప్రభావంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటే ఎఫ్‌బీఐ దర్యాప్తు తీరునూ, నిఘా వర్గాల పని పద్ధతులనూ సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఏ చిన్న అనుమానం వచ్చినా కఠిన చర్యలకు దిగే ఎఫ్‌బీఐ అతన్ని అంచనా వేయడంలో ఎందుకు విఫలమైందో తేలాల్సి ఉంది. ఇప్పుడు అమెరికాలో ఎన్నికల రుతువు గనుక దుండగుడి నేపథ్యంపై విస్తృత చర్చ మొదలైంది. వలస వచ్చినవారిపైనా, ముఖ్యంగా ముస్లింలపైనా చర్చ లేవ నెత్తి విద్వేషాలను రెచ్చగొడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఈ ఉదంతం అందివచ్చింది. దేశంలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని తాను చేసిన ప్రతిపాదన సరైందేనని రుజువైందని ఆయన వెనువెంటనే ప్రకటించారు. ట్రంప్ ప్రసంగాలతో ఇప్పటికే ఒక రకమైన అభద్రతా భావంతో ఉన్న శ్వేత జాతీయులను ఈ ఉదంతం మరింత భయభ్రాంతులకు గురిచేసిందన్నది వాస్తవం. మతీన్ ఉగ్రవాదా కాదా అన్న సంగతలా ఉంచి... అమెరికాలోని తుపాకి సంస్కృతి దీనికి ఎలా దోహదపడిందో అర్ధం చేసుకోవాలి. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని భావించే ఏ పౌరుడైనా మారణాయుధాన్ని కొనుక్కోవడం అక్కడ అత్యంత సులభం. అసలు రైఫిలో, మరో మారణాయుధమో కలిగి ఉండటాన్ని హోదాకు చిహ్నంగా పరిగణించే ధోరణి అక్కడ పెరిగింది. తుపాకి కలిగి ఉండే హక్కు పౌరులకు కల్పిస్తూ దశాబ్దాల క్రితమే అమెరికా రాజ్యాంగాన్ని సవరించారు. ఈమధ్య కాలంలో ఉన్మాదులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న ఘటనలు పెరిగాక తుపాకుల అమ్మకాలపై నియంత్రణ ఉండాలన్న డిమాండ్ బయల్దేరింది. ఒబామా సైతం ఇందుకు అనుకూలత వ్యక్తం చేశారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ప్రయత్నించారు. అయితే అమెరికాలోని నేషనల్ రైఫిల్ అసోసియే షన్ (ఎన్ఆర్ఏ) దీన్ని పడనివ్వలేదు. దేశానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నదని అర్ధమయ్యాకైనా తుపాకుల అమ్మకాలను నియంత్రించాలన్న ఆలోచన వారికి లేకపోయింది. సామూహిక జీవనంగా కాక వ్యక్తుల సమూహంగా సమాజం మిగిలి నప్పుడు ఎవరికీ ఎవరి గురించి పట్టని స్థితి ఒకటి ఏర్పడుతుంది. అలాంటి పరి స్థితుల్లో ఒక వ్యక్తి తీరుతెన్నులెలాంటివో, అతని కార్యకలాపాలేమిటో తెలుసు కోవడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యక్తిగత జీవితంలో తనకెదురవుతున్న ఇబ్బందులు లేదా పాలకుల విధానాలపై పెరిగిపోతున్న అసంతృప్తి తీవ్ర రూపం దాల్చి, అమాయక పౌరుల ప్రాణాలు తీయడానికి వెనకాడని మానసిక స్థితికి ఏ వ్యక్తయినా చేరుకుంటే మారణాయుధాలను పోగేసుకోవడం అలాంటిచోట పెద్ద కష్టం కాదు. ఆర్లెండో నగరంలో జరిగింది ఇదే. దీనికితోడు స్వలింగ సంపర్కులవంటి కొన్ని వర్గాల విషయంలో తమ అపోహలనూ, అజ్ఞానాన్నీ వెనకా ముందూ చూడకుండా ప్రచారం చేస్తూ అలాంటివారిపట్ల ఏహ్యభావాన్ని కలగజేసేవారు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. స్వలింగ సంపర్కం ఒక వ్యాధి అని, దానికి చికిత్స చేయొచ్చునని ఆమధ్య బాబా రాందేవ్ అనడం అందరికీ తెలిసిందే. మతీన్ చర్య వెనక కేవల ఉన్మాదమే ఉన్నదో, ఉగ్రవాదమే అందుకు కారణమో దర్యాప్తులో ఎటూ తేలుతుంది. కానీ స్వలింగసంపర్కుల క్లబ్‌ను అందుకు లక్ష్యంగా ఎంచుకోవడం వారిపట్ల అతనికున్న ద్వేషభావాన్ని వెల్లడిస్తుంది. ఈ ఉదంతమైనా అందరి కళ్లూ తెరిపించాలి. విధాన రూపకల్పనలోనైనా, అభిప్రాయాల వ్యక్తీకరణలోనైనా బాధ్యతాయుతంగా మెలగాలని తెలుసుకోవాలి. భయమన్నది ఎరుగని సృజనాత్మకమైన, ప్రమాదకరమైన ఉగ్రవాదం ప్రపంచాన్ని ఆవరించింది. దాని ముద్దుపేరు ఒంటరి ఉగ్రవాది. - జెప్రీ డి. సిమోన్ అమెరికన్ ఉగ్రవాద నిపుణులు -
మా వాడు వాళ్లను చంపాల్సింది కాదు
వాషింగ్టన్: ఫ్లోరిడాలోని గే క్లబ్లో నరమేధం సృష్టించి 50 మందిని కిరాతకంగా చంపిన ఒమర్ మతీన్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు కాదని అతని తండ్రి సిద్ధిఖీ మతీన్ చెప్పాడు. తన కొడుకు నైట్ క్లబ్‌పై దాడి చేసి ఉండాల్సికాదని చెబుతూనే.. స్వలింగ సంపర్కులను దేవుడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించాడు. సిద్ధిఖీ ఇచ్చిన ఇంటర్వ్యూను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆదివారం ఆర్లెండోలోని నైట్ క్లబ్లో అఫ్ఘానిస్తాన్ సంతతికి చెందిన ఉన్మాది ఒమర్ మతీన్ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. గే సమాజంపై అసహ్యంతోనే తన కొడుకు దాడికి పాల్పడి ఉండొచ్చని సిద్ధిఖీ చెప్పాడు. ఈ ఘటన జరగడానికి 12 గంటల ముందు తన కొడుకు ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో అతను సాధారణంగా కనిపించాడని తెలిపాడు. ఒమన్ అసహనంగా, కోపంగా ఉన్నట్టు అనిపించలేదని చెప్పాడు. నైట్ క్లబ్లో తన కొడుకు కాల్పులు జరిపాడని తెలియగానే షాక్‌కు గురయ్యాయనని పేర్కొన్నాడు. ఈ ఘటన చాలా బాధాకరమంటూ, అమెరికా ప్రజలకు సానుభూతి తెలిపాడు. -
'ఊహించని విషాదమిది'
ముంబై: ఆర్లెండో నైట్ క్లబ్ నరమేధంపై బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్మాది తూటాలకు బలైన వారికి సంతాపం తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం.. ఆర్లెండో నగరంలో గే (స్వలింగ సంపర్కులు)ల కోసం వెలిసిన పల్స్ నైట్ క్లబ్ లో ఆదివారం తెల్లవారుజామున ఉన్మాది జరిపిన కాల్పుల్లో 50 మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. 'ఆర్లెండోలో కాల్పులు బాధాకరం. మృతులకు సంతాపం తెల్పుతున్నా. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరూ వాడుకోరని భావిస్తున్నా'నని రిషికపూర్ పేర్కొన్నారు. ఆర్లెండో బాధితులకు వచ్చిన కష్టం ఊహించరాదని ఫర్హాన్ అక్తర్ అన్నాడు. నరమేధం గురించి తెలుసుకుని తన హృదయం ద్రవీంచిపోయిందని ప్రియాంక చోప్రా అంది. విద్వేష దాడులు ఆపాలని సోనమ్ కపూర్ ఆకాంక్షించింది. ఆర్లెండో కాల్పుల ఉదంతం తనను కలచివేసిందని, షాక్ కు గురి చేసిందని అలియా భట్ పేర్కొంది. హింస ఆపాలని కోరుతూ సిద్ధార్థ మల్హోత్రా ఆర్లెండో కాల్పుల మృతులకు నివాళి అర్పించాడు. గన్ కల్చర్ పై అమెరికా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కునాల్ కోహ్లి అన్నాడు. అర్జున్ రాంపాల్, బిపాసా బసు, అదితిరావు హైద్రి, పులకిత్ శర్మ, తమన్నా భాటియా కూడా సంతాపం ప్రకటించారు. Please please stop the hate... "It was times like these when I thought my father, who hated… https://t.co/cIAvHkeCYZ — Sonam Kapoor (@sonamakapoor) 13 June 2016 -
ఒబామా అలా ఎందుకు చెప్పలేదు?
వాషింగ్టన్: ఆర్లెండో నెట్ క్లబ్ లో దాడిని గట్టిగా ఖండించలేకపోయిన అమెరికా అధ్యక్షుడు ఒబామా రాజీనామా చేయాలని రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఆర్లెండో నరమేధానికి 'రాడికల్ ఇస్లాం' కారణమని ఒబామా చెప్పలేకపోయారని అన్నారు. ఆర్లెండోలో జరిగిన ఘటన విద్వేషపూరిత, ఉగ్రవాద ఘాతుకమని బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. 'మన నాయకులు బలహీనులు కావడం వల్లే ఈ దాడి జరిగింది. ఇలాంటివి జరుగుతాయని నేను ముందే చెప్పాను. భవిష్యత్ లో ఉగ్రవాద దాడులు జరగకుండా నిలువరించి, ప్రజలను కాపాడానికి ప్రయత్నిస్తా'నని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఆర్లెండో దాడి గురించి ప్రస్తావించనున్నారని ఆయన ప్రచారం బృందం తెలిపింది.