అమెరికా విషాదం!
ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా తుపాకి సంస్కృతిని వదులుకోవడానికి సిద్ధపడని అమెరికాలో ఒమర్ మతీన్ అనే ఉన్మాది స్వలింగ సంపర్కుల క్లబ్‌లో రెచ్చిపోయి కాల్పులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరో 53మందిని గాయపరిచాడు. ఆ వెంటనే క్లబ్‌పై దాడి చేసిన పోలీసులు మతీన్‌ను కాల్చి చంపారు. ఇంతమందిని ఒక దుండగుడు హతమార్చడం అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ దుర్మార్గానికి ఒడిగట్టే ముందు తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన సందేశా లనుబట్టి మతీన్ అఫ్ఘాన్ తాలిబన్‌ల మద్దతుదారుడని పోలీసులు ప్రాథ మిక నిర్ధారణకొచ్చినా ఉగ్రవాద సంస్థలతో అతని సంబంధాలెలాంటివో ఇంకా తేల వలసే ఉన్నది. ఈ ఉదంతంలో మత ప్రమేయం లేదని, అతనికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని మతీన్ తండ్రి చెబుతున్నాడు. కేవలం స్వలింగ సంపర్కులంటే ఉండే అసహ్యంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చునని అంటున్నాడు.
కాల్పులు జరుపుతున్న సమయంలోనే మతీన్ పోలీస్ విభాగానికి ఫోన్‌చేసి తాను ఉగ్రవాద ఐఎస్ సంస్థకు చెందినవాడినని ప్రకటించుకున్నట్టు కొన్ని మీడియా కథ నాలు చెబుతున్నాయి. ఉగ్రవాద సంస్థ ఐఎస్ మాత్రం మతీన్ తమ మిలిటెంటే నని ప్రకటించింది. అమెరికాలో ఇలాంటి కాల్పుల ఉదంతం చోటు చేసుకున్నప్పు డల్లా అది తమ ఘనకార్యమేనని చెప్పుకోవడం ఐఎస్‌కు మామూలే! ఇందులోని నిజా నిజాలు నిర్ధారణ కావలసి ఉంది.
ఎంతో భద్రంగా, క్షేమంగా ఉన్నట్టు కనబడే అమెరికా సమాజంలో ఈ మాదిరి ఘటనలు లోగడ కూడా జరిగాయి. నాలుగేళ్లక్రితం ఒక ప్రాథమిక పాఠశాలపై దాడి చేసిన యువకుడు 18మంది చిన్నారులు, ప్రిన్సిపాల్, సైకాలజిస్టుతో సహా 28 మందిని కాల్చిచంపాడు. నిరుడు శాన్ బెర్నార్డినోలో ఉగ్రవాద జంట కాల్పులకు దిగి 14మందిని హతమార్చారు. గత మూడేళ్లలో 200 మందికి పైగా ఇలాంటి ఉదంతాల్లో మరణించారు. మరో 200మంది గాయపడ్డారు. ఈమధ్య కాలంలో ఈ మాదిరి ఉదంతాలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఏడాదికి సగటున 6.4 ఉదంతాలు జరగ్గా, ఇప్పుడు అవి 16.4కు చేరుకున్నాయని ఆ లెక్కలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా ఒక సంస్థకో, బృందానికో చెందినవారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే కాస్త ముందో, వెనకో వాటి కూపీ లాగడం, నియం త్రించడం పోలీసులకు సాధ్యమవుతుంది. కానీ ఎవరి ప్రమేయమూ లేకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కడే దాడులకు పాల్పడితే అలాంటివారిని ముంద స్తుగా గుర్తించడం, నియంత్రించడం ఎంత నిఘా ఉన్నా అసాధ్యమవుతుంది.
అయితే ఇంతవరకూ ఆ దేశంలో సాగుతున్న ఘటనలకూ, ప్రస్తుతం జరిగిన ఘట నకూ మౌలికంగా తేడా ఉంది. నిందితుడు అఫ్ఘాన్ సంతతికి చెందిన యువకుడు. ఇస్లాం మత విశ్వాసాలున్నవాడు. పైగా మూడేళ్ల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరో సారి ‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై ఎఫ్‌బీఐ మతీన్‌ను విచారిం చింది. మతీన్ ఉగ్రవాద ప్రభావంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటే ఎఫ్‌బీఐ దర్యాప్తు తీరునూ, నిఘా వర్గాల పని పద్ధతులనూ సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఏ చిన్న అనుమానం వచ్చినా కఠిన చర్యలకు దిగే ఎఫ్‌బీఐ అతన్ని అంచనా వేయడంలో ఎందుకు విఫలమైందో తేలాల్సి ఉంది.
ఇప్పుడు అమెరికాలో ఎన్నికల రుతువు గనుక దుండగుడి నేపథ్యంపై విస్తృత చర్చ మొదలైంది. వలస వచ్చినవారిపైనా, ముఖ్యంగా ముస్లింలపైనా చర్చ లేవ నెత్తి విద్వేషాలను రెచ్చగొడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఈ ఉదంతం అందివచ్చింది. దేశంలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని తాను చేసిన ప్రతిపాదన సరైందేనని రుజువైందని ఆయన వెనువెంటనే ప్రకటించారు. ట్రంప్ ప్రసంగాలతో ఇప్పటికే ఒక రకమైన అభద్రతా భావంతో ఉన్న శ్వేత జాతీయులను ఈ ఉదంతం మరింత భయభ్రాంతులకు గురిచేసిందన్నది వాస్తవం. మతీన్ ఉగ్రవాదా కాదా అన్న సంగతలా ఉంచి... అమెరికాలోని తుపాకి సంస్కృతి దీనికి ఎలా దోహదపడిందో అర్ధం చేసుకోవాలి. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని భావించే ఏ పౌరుడైనా మారణాయుధాన్ని కొనుక్కోవడం అక్కడ అత్యంత సులభం. అసలు రైఫిలో, మరో మారణాయుధమో కలిగి ఉండటాన్ని హోదాకు చిహ్నంగా పరిగణించే ధోరణి అక్కడ పెరిగింది. తుపాకి కలిగి ఉండే హక్కు పౌరులకు కల్పిస్తూ దశాబ్దాల క్రితమే అమెరికా రాజ్యాంగాన్ని సవరించారు. ఈమధ్య కాలంలో ఉన్మాదులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న ఘటనలు పెరిగాక తుపాకుల అమ్మకాలపై నియంత్రణ ఉండాలన్న డిమాండ్ బయల్దేరింది. ఒబామా సైతం ఇందుకు అనుకూలత వ్యక్తం చేశారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ప్రయత్నించారు.
అయితే అమెరికాలోని నేషనల్ రైఫిల్ అసోసియే షన్ (ఎన్‌ఆర్‌ఏ) దీన్ని పడనివ్వలేదు. దేశానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నదని అర్ధమయ్యాకైనా తుపాకుల అమ్మకాలను నియంత్రించాలన్న ఆలోచన వారికి లేకపోయింది. సామూహిక జీవనంగా కాక వ్యక్తుల సమూహంగా సమాజం మిగిలి నప్పుడు ఎవరికీ ఎవరి గురించి పట్టని స్థితి ఒకటి ఏర్పడుతుంది. అలాంటి పరి స్థితుల్లో ఒక వ్యక్తి తీరుతెన్నులెలాంటివో, అతని కార్యకలాపాలేమిటో తెలుసు కోవడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యక్తిగత జీవితంలో తనకెదురవుతున్న ఇబ్బందులు లేదా పాలకుల విధానాలపై పెరిగిపోతున్న అసంతృప్తి తీవ్ర రూపం దాల్చి, అమాయక పౌరుల ప్రాణాలు తీయడానికి వెనకాడని మానసిక స్థితికి ఏ వ్యక్తయినా చేరుకుంటే మారణాయుధాలను పోగేసుకోవడం అలాంటిచోట పెద్ద కష్టం కాదు. ఆర్లెండో నగరంలో జరిగింది ఇదే. దీనికితోడు స్వలింగ సంపర్కులవంటి కొన్ని వర్గాల విషయంలో తమ అపోహలనూ, అజ్ఞానాన్నీ వెనకా ముందూ చూడకుండా ప్రచారం చేస్తూ అలాంటివారిపట్ల ఏహ్యభావాన్ని కలగజేసేవారు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. స్వలింగ సంపర్కం ఒక వ్యాధి అని, దానికి చికిత్స చేయొచ్చునని ఆమధ్య బాబా రాందేవ్ అనడం అందరికీ తెలిసిందే. మతీన్ చర్య వెనక కేవల ఉన్మాదమే ఉన్నదో, ఉగ్రవాదమే అందుకు కారణమో దర్యాప్తులో ఎటూ తేలుతుంది. కానీ స్వలింగసంపర్కుల క్లబ్‌ను అందుకు లక్ష్యంగా ఎంచుకోవడం వారిపట్ల అతనికున్న ద్వేషభావాన్ని వెల్లడిస్తుంది. ఈ ఉదంతమైనా అందరి కళ్లూ తెరిపించాలి. విధాన రూపకల్పనలోనైనా, అభిప్రాయాల వ్యక్తీకరణలోనైనా బాధ్యతాయుతంగా మెలగాలని తెలుసుకోవాలి.
భయమన్నది ఎరుగని సృజనాత్మకమైన, ప్రమాదకరమైన ఉగ్రవాదం ప్రపంచాన్ని ఆవరించింది. దాని ముద్దుపేరు ఒంటరి ఉగ్రవాది.
- జెప్రీ డి. సిమోన్
అమెరికన్ ఉగ్రవాద నిపుణులు