నిర్దోషినని నిరూపిస్తా
అందుకు తగిన ఆధారాలున్నాయన్న విజయ్ మాల్యా
► నేరస్తుల అప్పగింత కేసులో లండన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు
► రుణాల్ని మళ్లించలేదని వివరణ
► డిసెంబర్ 4 వరకూ బెయిల్ పొడిగింపు.. విచారణ జూలై 6కి వాయిదా
లండన్: తనను నిర్దోషిగా పేర్కొంటూ రుణ ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి మొండివాదన కొనసాగించారు. అందుకు తన వద్ద తగినన్ని ఆధారాలున్నాయని, కోర్టులో అవే సమాధానం చెబుతాయంటూ భారత్‌కు సవాలు విసిరే ప్రయత్నం చేశారు. నేరస్తుల అప్పగింత కేసులో మంగళవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు మాల్యా హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తనపై మోపిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఆధారాలు లేకుండా నేరస్తుడిగా నిరూపించలేరంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
భారత్‌లో బ్యాంకులకు రూ.9 వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను నేరస్తుల అప్పగింతలో భాగంగా స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మాల్యా హాజరైన కొద్దిసేపటికే విచారణను కోర్టు జూలై 6కి వాయిదావేసింది. ఈ సందర్భంగా అతని బెయిల్‌ను డిసెంబర్ 4 వరకూ పొడిగించింది. అనంతరం కోర్టు వెలుపల మాల్యా మాట్లాడుతూ.. ‘నేను ఏ కోర్టు నుంచి తప్పించుకుని తిరగడం లేదు. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలున్నాయి. మీడియాకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వను. ఎందుకంటే ఏం చెప్పినా దానిని వక్రీకరిస్తా’రని పేర్కొన్నారు.
భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ వాదనలు
ఈ కేసులో భారత అధికారుల తరఫున బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) వాదనలు వినిపిస్తోంది. గత నెల్లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఉమ్మడి బృందం లండన్‌లో సీపీఎస్ అధికారుల్ని కలుసుకుని కేసు పూర్వాపరాలపై చర్చించింది. మంగళవారం జరిగిన కేసు విచారణకు ఢిల్లీ నుంచి సీబీఐ అధికారి కూడా హాజరయ్యారు. నిజానికి ఈ కేసు విచారణ మే 17నే జరగాల్సి ఉండగా.. జూన్ 13కు వాయిదా వేశారు.
తుది విచారణలో మాల్యా అప్పగింతకు అనుకూలంగా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిస్తే.. అప్పగింతకు సంబంధించి రెండు నెలల్లోపు బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీచేయాలి. అయితే తీర్పుపై మాల్యా పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చు. ఈ కేసులో ప్రముఖ క్రిమినల్ న్యాయవాది క్లేర్ మాంట్‌గోమెరీ మాల్యా తరఫున వాదనలు వినిపిస్తుండగా... సీపీఎస్ నేరస్తుల అప్పగింత విభాగం, భారత ప్రభుత్వం తరఫున మరో ప్రముఖ న్యాయవాది మార్క్ సమ్మర్స్ వాదిస్తున్నారు.
ప్రాథమిక విచారణ పూర్తయ్యాకే అప్పగింతపై వాదనలు
మెజిస్ట్రేట్ కోర్టులో ప్రాథమిక విచారణ పూర్తయ్యాకే నేరస్తుల అప్పగింతపై తుది విచారణ నిర్వహిస్తారు. తుది తీర్పుకు అనుగుణంగా నేరస్తుడ్ని అప్పగించాలా? వద్దా? అన్న అంశాన్ని విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. అనంతరం మాల్యాను అప్పగించాలంటూ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)కు మరోసారి భారత్ విజ్ఞప్తి చేయాలి. అప్పుడు అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది.భారత్ ఒత్తిడి మేరకు ఏప్రిల్ 18న లండన్‌లో మాల్యాను అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో అతన్ని హాజరుపర్చగా బెయిల్‌పై విడుదలయ్యారు. మాల్యాపై అనేక నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు జారీ అవడంతో 2016లో లండన్ పారిపోయారు.
అంత సులువు కాదు: వీకే సింగ్
మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని, నేరస్తుల అప్పగింత అంత సులువుకాదని ఆయన పేర్కొన్నారు.
అందుకే మ్యాచ్‌కు వెళ్లా
తాను భారత జట్టును ఉత్సాహాపరిచేందుకు క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లానని, అయితే మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. ‘తాగిన మత్తులో ఇద్దరు దొంగ అని పిలిచారు. అయితే చాలామంది నన్ను మంచిగా పలకరించార’ని ఓవల్ క్రికెట్ మైదానం బయట ఘటనపై మాల్యా వివరణ ఇచ్చారు. ‘ వేలకోట్ల కోసం కలల్ని మీరు కొనసాగించవచ్చు. అయితే ఆధారాలు లేకుండా ఏమీ నిరూపించలేరు’ అని వ్యాఖానించారు. వేలకోట్ల బ్యాంకు రుణాల్ని తాను ఎక్కడికీ మళ్లించలేదన్నారు. విజయ్ మాల్యా తరఫున కేసు బాధ్యతలు చూస్తున్న జోసెఫ్ హేగ్ అరన్‌సన్ న్యాయ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. నేరస్తుల అప్పగింతపై భారత ప్రభుత్వం మరోసారి బ్రిటన్‌కు విజ్ఞప్తి చేయవచ్చన్నారు.