ఆమెకు బెస్ట్‌ మమ్మీ అవార్డు ఇవ్వాలి! | Viral: Mom Recreate Her Child Drawing | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత ఫొటోలో ఉన్నట్టుగా కనిపించి...

Published Sun, Mar 1 2020 2:56 PM | Last Updated on Sun, Mar 1 2020 3:54 PM

Viral: Mom Recreate Her Child Drawing - Sakshi

చిన్న పిల్లలు గీసే చిత్రాలు ఎలాగుంటాయి? అబ్బో అసలు ఏం గీశారో ఆ చిన్ని మేధావులకు తప్ప మనలాంటివారికి అంతుచిక్కదు. తీరా వాళ్లు మేము గీసింది ఇదీ అని వివరించి చెప్తేగానీ తెలియదునుకోండి. అదేవిధంగా ఓ చిన్నారి కూడా ఆర్టిస్టు అవతారమెత్తి తన తల్లి బొమ్మ గీద్దామనుకుంది. అనుకున్నదే తడవుగా కుంచె పట్టి ఓ చిత్రాన్ని ఆవిష్కరించింది. ఇది చూసిన ఆమె తల్లి ఎస్క్ర్టాండ్‌ తనను తాను పోల్చుకోలేక అయోమయానికి లోనైంది. ఏమైతేనేం.. తన గారాలపట్టి గీసిన బొమ్మ తనకు అద్భుత చిత్రకావ్యమే అనుకుని దాన్ని భద్రంగా దాచుకుంది. అరుదైన కానుకగా దాన్ని ఫ్రేము చేయించి మరీ పెట్టుకుంది. సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే ఈమధ్యే ఆమె ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది.

కానీ ఈసారి ఆ తల్లి అచ్చంగా కూతురు గీసిన బొమ్మలానే ఉంది. తన మేకప్‌ వేసుకుని మరీ ఫొటోలో ఉన్నట్టుగా రావడానికి ఎంతగానో కష్టపడింది. అనంతరం పెయింటింగ్‌తో పాటు కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ తల్లిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మీ కూతురు గీసిన బొమ్మను ఫ్రేము కట్టించి మరీ దాచుకోవడం నిజంగా అద్భుతం’ అని ఓ వ్యక్తి కామెంట్‌ చేయగా.. దానికి ఆమె స్పందిస్తూ ‘ఇది వెలకట్టలేని ఆస్తి, నాకు మాత్రమే దక్కిన అరుదైన బహుమానం’ అని చెప్పుకొచ్చింది. ‘ఆమెకు బెస్ట్‌ మమ్మీ అవార్డు ఇ‍వ్వాలి’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. కాగా ఈ చిత్రాన్ని గీసిన చిన్నారికి ఇప్పుడు పంతొమ్మిదేళ్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement