ఫ్లోరిడా: సాహసం చేయరా ఢింభకా అంటున్నారు ఓ మహిళ. అయితే ఆమె చేసిన సాహసం మాత్రం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు చాలామంది జనాలు. అష్లే లారెన్స్ అనే మహిళ మైదానంలో అడుగుపెట్టింది. చుట్టూ కొంత దూరంలో జనాలు గుమిగూడి ఉన్నారు. ఆమె ఎదురుగా ఓ మొసలి ఉంది. ఆమె దానికి చేరువగా వెళ్లింది. గోరుముద్దలు తినిపించడానికి అన్నట్లుగా మొసలి నోరును తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ మొసలి అందుకు సహకరించలేదు. దీంతో అతి కష్టంగానే రెండు చేతులతో దాన్ని అదిమిపట్టుకుని నోరును తెరిచింది. వెంటనే నేరుగా ఆమె తలను మొసలి నోట్లోకి పోనిచ్చింది. ఇది చూసిన మనకు క్షణంపాటు గుండె కొట్టుకోవడం ఆపేసినట్లనిపిస్తుంది. అసలే కౄర జంతువు. పైగా దాని నోట్లో తలకాయ పెట్టడం అంటే మృత్యువుకు ఎదురెళ్ళడమే. కానీ అదృష్టవశాత్తూ కొన్ని సెకన్ల తర్వాత ఎలాంటి ప్రమాదం బారిన పడకుండానే దాని నోట్లో నుంచి సురక్షితంగా తల బయటకు తీసింది.
ఇంతకూ ఇది ఫ్లోరిడాలో జరిగిన మొసళ్లతో కుస్తీపోటీలో జరిగింది. ఈ మొసలి 8.5 అడుగుల పొడవు, 90 కిలోల బరువు ఉండగా దాని నోట్లో తలపెట్టిన అమ్మాయి నాలుగడుగుల 11 ఇంచుల పొడవు, 50 కిలోల బరువు ఉండటం గమనార్హం. ఈ ఘటన గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ఈ పోటీలోకి దిగిన తొలి వ్యక్తిని నేనే. ఈ సాహసానికి పూనుకున్నందుకు నాకు ప్రేక్షకుల నుంచే కాక పోటీదారుల నుంచి కూడా ప్రేమానురాగాలు అందాయి. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండానే దాని నోరు తెరిచా’నని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అలాంటి ప్రయోగం చేసి చావును దగ్గర నుంచి చూసేంత ధైర్యం చేయలేమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment