
3,700 కి.మీ వేటకెళ్లిన పుతిన్ చొక్కా విప్పేసి..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను మీరు ఎప్పుడైన గమనించారా.. దాదాపు ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన చేష్టలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంటాయి.
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను మీరు ఎప్పుడైన గమనించారా.. దాదాపు ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన చేష్టలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంటాయి. కాలక్షేపానికి, మనసును తేలిగ్గా ఉంచుకునేందుకు ఆయన చేసే పనులు ఎంత ఆసక్తిగా ఉంటాయో ఓ పట్టాన చెప్పనక్కర్లేదు. మొన్నామధ్య బీజింగ్‌లో చైనా రష్యా దేశాల ద్వైపాక్షిక చర్యలకు వెళ్లిన పుతిన్ చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ వచ్చే వరకు ఖాళీగా ఉండకుండా పియానో వాయిస్తూ అందరిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పటికే జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట అయిన ఆయన పియానో కూడా వాయించడంతో అంతా ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు అందరినీ మరింత ఆశ్చర్యపరిచేలా ఆయన చేపల వేటలో నిమగ్నమయ్యారు. అది కూడా ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లుగా. కొంతమంది స్నేహితులతో కలిసి మంగోలియన్ సరిహద్దులోగల దక్షిణ సైబీరియాలోని రిపబ్లిక్ ఆఫ్ టివా ప్రాంతానికి గాలం తీసుకొని వెళ్లారు. ఇది మాస్కోకు 3,700కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి వెళ్లిన పుతిన్ మూడు రోజులపాటు సరదాగా గడుపుతూ చొక్కా విప్పేసి నదిలోకి దిగేశారు. ప్రత్యేక మాస్క్‌లు ధరించి నీటి అడుగుకు వెళ్లి చేపల వేట కొనసాగించారు.
వివిధ రకాలుగా స్మిమ్మింగ్ చేస్తూ పెద్ద పెద్ద చేపలను స్వయంగా గాలంతో పట్టేశాడు. ఆ సమయంలో ఆయనతో రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చి తెగ హల్ చల్ చేస్తున్నాయి. 64 వయసులో కూడా ఆయన శరీరదారుఢ్యం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇప్పటికీ ఆయనకు ఆరుపలకల దేహం కనిపిస్తుందంటే పుతిన్ తన ఆరోగ్యం విషయంలో ఇప్పటికీ అంత శ్రద్ధ తీసుకుంటారా అని ముక్కున వేలేసుకోవాల్సిందే.