
మాస్కో : రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం అర్ధరాత్రి 11.30 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. దాదాపు 99.9శాతం బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయినట్టు, లెక్కించిన ఓట్లలో పుతిన్ 76.67శాతం ఓట్లను సాధించినట్లు రష్యా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది నాల్గోసారి. 2000 సంవత్సరంలో ప్రారంభమైన పుతిన్ రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో గెలుపోందటంతో 2024 వరకూ కొనసాగనుంది. 2012 వరకూ రష్యాలో అధ్యక్షుడి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు మాత్రమే. కానీ 2012లో పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదవీ కాలాన్ని నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించారు.
రష్యాను అత్యధిక కాలం పాలించిన నియంత జోసఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉన్న నాయకుడుగా పుతిన్ రికార్డు నెలకొల్పనున్నారు. పుతిన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన నేత లేకపోవడం, పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంతో ఏకపక్షంగా ఫలితం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment