హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న డేనిషర్
పెర్త్ : నిత్యం ఉపయోగించే వాటర్ ట్యాప్ (నీళ్ల కొళాయి)ను తాకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. పెరడులోని మొక్కలకు నీళ్లు పట్టిన అనంతరం వాటర్ ట్యాప్‌ను బంద్ చేసేందుకు ఆమె దానిని ముట్టుకోవడంతో ఏకంగా 240 వోల్ట్స్ పవర్‌తో షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆ బాలిక మెదడు దెబ్బతినడంతో తిరిగి మామూలు స్థితికి రాలేని పరిస్థితుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ పట్టణమైన బెల్డన్‌లో చోటుచేసుకుంది.
డేనిషర్ వుడ్స్ అనే బాలిక తన ఇంటి పెరడులోని మొక్కలకు నీళ్లు పెట్టిన అనంతరం.. వాటర్ ట్యాప్‌ను ఆఫ్ చేయడానికి దాన్ని ముట్టుకోగానే.. షాక్ కొట్టింది. దీంతో డేనిషర్ అక్కడికక్కడే కుప్పకూలింది. అది గమనించిన ఆమె తల్లి లేసీ హ్యారిసన్ ఆస్పత్రికి తరలించగా.. హై ఓల్టేజ్ పవర్ కారణంగా ఆ బాలిక మెదడు పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు.
50 ఓల్ట్‌ల కన్నా ఎక్కువ విద్యుత్ శరీరానికి తగిలినపుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వివరించారు. దాదాపు 240 ఓల్ట్‌ల షాక్ తగలటం వల్ల ఆమె మెదడుకు తీవ్రగాయమైందని, ఇక ఎప్పటికీ ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రి బెడ్ పై ఉన్న కూతుర్ని చూసి డేనిషర్ తల్లి కంటతడిపెట్టుకుంది. ఎలాగైనా తన కూతురిని బతికించాలని వైద్యులను ప్రాధేయపడింది. ఇదివరకే తనకు చిన్నపాటి కరెంట్ షాక్ తగిలిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదని ఆమె తెలిపింది. న్యూట్రల్ కేబుల్ వైర్ తెగిపోయినపుడు ఇంటిలో ఎర్తింగ్ అనుసంధానం చేయబడిన ప్రతి వస్తువుకు కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. అసలు నీళ్ల కొళాయికి కరెంట్ ఎలా వచ్చింది. అందుకు ఇంటిలోని విద్యుత్ సమస్యలే కారణమా అన్నవిషయాలపై అధికారులు దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment