అసలు ఎవరైనా ఎన్నేళ్ల వయసులో రిటైర్ అవుతారు.. 58, 60, 65, 70..
మరి ఓ కంపెనీ సీఈవో 12 ఏళ్ల వయసులో రిటైర్ అయితేనో! అదీ తన బర్త్‌డే రోజునే ఆ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకుంటేనో!!
అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ..
హోంవర్కు చేయాల్సిన వయసులో ఆఫీసు వర్కు చేయడం ఏమిటి? అనేదేగా మీ డౌటు. విషయం తెలియా లంటే.. పదండి మరి ఆస్ట్రేలియాకు.. ఎందుకంటే.. పిక్సీ ఉండేది అక్కడే మరి.. పిక్సీ కర్టిస్.. చిన్నప్పటి నుంచే చురుకైన పిల్ల.. బుర్రలో బోలెడన్ని ప్లాన్లు. దీనికి ఆమె తల్లి రాక్సీ జెసెన్కో ప్రోత్సాహం తోడైంది. రాక్సీ సిడ్నీలోని ఓ పీఆర్ కంపెనీ డైరెక్టర్. పిక్సీ చిన్న వయసులోనే పలు కంపెనీల ఉత్పత్తులకు మోడల్‌గా పనిచేసింది. పిక్సిస్ బౌ పేరిట హెయిర్ బౌస్‌ను అమ్మింది కూడా. అయితే, కరోనా సమయంలో తన దశ తిరిగింది.
2021లో తల్లితో కలిసి పిక్సీస్ ఫిడ్జెట్స్ పేరిట ఆట బొమ్మల ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. అది సక్సెస్ కావడంతో ఆస్ట్రేలియాలో పిక్సీ యంగెస్ట్ ఆంట్రప్రెన్యూర్‌గా మారిపోయింది. ఆమె నెల సంపాదన రూ. కోటికి పైనే. తనకు సొంత బెంజ్ కారు కూడా ఉంది. ఇన్నాళ్లూ ఆఫీసు వర్కుతో బిజీబిజీగా గడిపిన పిక్సీ ఇప్పుడు స్కూల్ హోంవర్కు మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. తల్లి కూడా అదే చెప్పడంతో తన 12వ బర్త్‌డే రోజున రిటైర్ కానుంది. దీనికితోడు పిక్సీ కుటుంబం ఆమె తండ్రి కర్టిస్ పనిచేస్తున్న సింగపూర్‌కు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకోవడంతో గత శనివారం ప్రీ బర్త్‌డే కం రిటైర్‌మెంట్ పార్టీని కూడా ఇచ్చారు.
సింగపూర్ థీమ్‌తో సాగిన ఈ పార్టీకి వచ్చినవాళ్లందరికీ రూ.4,112 విలువ చేసే స్కిన్‌కేర్ ఉత్పత్తులతో కూడిన బహుమతిని కూడా ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను ఆస్ట్రేలియా లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఎంకోబ్యూటీ స్పాన్సర్ చేసింది. అదండీ.. 12 ఏళ్లకే తన బర్త్‌డే రోజున రిటైర్ అవుతున్న ఓ సీఈవో సంగతి.. ఇంతకీ పిక్సీ బర్త్‌డే కం రిటైర్‌మెంట్ డేట్ చెప్పలేదు కదూ.. ఆగస్టు 16.
Comments
Please login to add a commentAdd a comment